Heavy Rains: హైదరాబాద్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. భారీ వర్షాలపై అలర్ట్
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల తీవ్రత దృష్ట్యా అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 19 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని స్పష్టం చేసింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. వర్షం వల్ల కలిగే ఇబ్బందులను నివారించడానికి టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సహాయం అందుబాటులో ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల వల్ల నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.