LOADING...
Telangana: ప్రభుత్వం ఆధీనంలోకి మెట్రోరైలు సంస్థ.. కీలక నిర్ణయం
ప్రభుత్వం ఆధీనంలోకి మెట్రోరైలు సంస్థ.. కీలక నిర్ణయం

Telangana: ప్రభుత్వం ఆధీనంలోకి మెట్రోరైలు సంస్థ.. కీలక నిర్ణయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2026
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు, ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు హైదరాబాద్ లిమిటెడ్‌లోని 100 శాతం వాటాను, అప్పులతో సహా సుమారు రూ.15,000 కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి మంత్రివర్గ ఉపసంఘానికి బాధ్యతలు అప్పగించారు. ఈనెల 31 నాటికి పూర్తి స్వాధీనంపై చర్చించిన మంత్రివర్గం, లావాదేవీ ముగింపు తేదీని ఖరారు చేసే అధికారాన్ని ఉపసంఘానికి ఇచ్చింది. ఉపసంఘం తుది నిర్ణయం తీసుకుని, వచ్చే మంత్రివర్గ సమావేశానికి ప్రతిపాదనలు సమర్పించనుంది.

వివరాలు

ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా నిధులు

మెట్రో కొనుగోలుకు అవసరమైన నిధులను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా సమకూర్చనున్నారు. కాగా, స్వాధీన ప్రక్రియ ముగింపు తేదీగా ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేసిన 2025 సెప్టెంబర్ 25 లేదా మంత్రివర్గం ఆమోదం తెలిపిన 2026 ఫిబ్రవరి 23 తేదీలలో ఏదో ఒకదాన్ని గుర్తించాలని ఎల్‌అండ్‌టీ కోరింది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను కూడా ఉపసంఘానికే అప్పగించారు. ఇక మెట్రో విస్తరణకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

వివరాలు

విస్తరణ పనులను వేగవంతం

ఫేజ్-2ఏ కింద రూ.24,269 కోట్ల వ్యయంతో 76.4 కిలోమీటర్ల మార్గానికి, ఫేజ్-2బీ కింద రూ.19,579 కోట్లతో 86.1 కిలోమీటర్ల మార్గానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుతం ఉన్న తొలి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం ద్వారా విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మెట్రోరైలు విధానం ప్రకారం రెండో దశకు అవసరమైన అనుమతులు పొందే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో స్వాధీన ప్రతిపాదనకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

Advertisement