LOADING...
Vizag Steel: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. విశాఖ ఉక్కు ఉత్పత్తిపై ఎల్‌పీజీ కొరత ప్రభావం
విశాఖ ఉక్కు ఉత్పత్తిపై ఎల్‌పీజీ కొరత ప్రభావం

Vizag Steel: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. విశాఖ ఉక్కు ఉత్పత్తిపై ఎల్‌పీజీ కొరత ప్రభావం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విశాఖ ఉక్కు పరిశ్రమపై కూడా కనిపిస్తోంది. ఎల్‌పీజీ (లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌)నిల్వలు తగ్గిపోవడంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రభావితమవుతున్నాయి. ప్లాంట్‌లోని స్టీల్‌ మెల్ట్‌షాప్‌(ఎస్‌ఎంఎస్‌)వద్ద బ్లూమ్స్‌ను కట్‌ చేయడానికి ఎల్‌పీజీని ఉపయోగిస్తారు. అలాగే ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో డీగ్యాసింగ్‌ ప్రక్రియలో,ఇంజినీరింగ్‌ షాప్‌లో జరుగుతున్న పలు పనుల్లో కూడా ఈ గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ప్లాంట్‌లో రోజుకు సుమారు 4 వేల బ్లూమ్స్‌ను కట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ బ్లూమ్స్‌ను కట్‌ చేసిన తర్వాతే బెడ్‌ ఖాళీ అవుతుంది. అలా ఖాళీ అయితేనే నిరంతర కాస్టింగ్‌ ప్రక్రియ సాఫీగా కొనసాగుతుంది. ఈ ప్రక్రియలు సక్రమంగా సాగితే ప్రతిరోజూ దాదాపు 10 వేల టన్నుల ఫినిష్డ్‌ స్టీల్‌ను తయారు చేయగలుగుతారు.

వివరాలు 

ప్లాంట్‌ అవసరాల కోసం ప్రతిరోజూ సుమారు 13 టన్నులు 

అయితే ఎల్‌పీజీ సరఫరా ఆగిపోతే ఫినిష్డ్‌ స్టీల్‌ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్లాంట్‌ అవసరాల కోసం ప్రతిరోజూ సుమారు 13 టన్నుల ఎల్‌పీజీ వినియోగిస్తున్నారు. మొత్తం నిల్వ సామర్థ్యం 325 టన్నుల వరకు ఉండగా, ప్రస్తుతం ఉన్న నిల్వలు గరిష్టంగా పది రోజులకు మాత్రమే సరిపోతాయని కార్మిక సంఘాలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు 

యుద్ధం కారణంగా సరఫరా అంతరాయం

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఎల్‌పీజీని సరఫరా చేస్తోంది. అయితే పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గృహ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆయిల్‌ కంపెనీలకు సూచించింది. తాజాగా గృహ వినియోగంతో పాటు ఎరువుల పరిశ్రమలు, పవర్‌ ప్లాంట్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం సూచించినట్లు సమాచారం. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Advertisement

వివరాలు 

కేంద్రమంత్రికి ఎంపీ విజ్ఞప్తి

ఇదే తరహా పరిస్థితి 2022లో కూడా ఏర్పడింది. అప్పట్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉండటంతో బాయిలర్‌ కోల్‌ను కేవలం పవర్‌ ప్లాంట్లకు మాత్రమే సరఫరా చేయాలని కేంద్రం ఆదేశించింది. ఆసమయంలో దాదాపు నెల రోజుల పాటు విశాఖ ఉక్కు ప్లాంట్‌కు బాయిలర్‌ కోల్‌ అందకపోవడంతో ఉత్పత్తి కార్యకలాపాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడూ యుద్ధప్రభావంతో గ్యాస్‌ కొరత ఏర్పడి ఉక్కు ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు ప్లాంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉత్పత్తి ఆగకుండా ఉండేందుకు అవసరమైన ఎల్‌పీజీసరఫరా కొనసాగించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్‌ దిల్లీలో కేంద్రపెట్రోలియం శాఖ అధికారులతో చర్చించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Advertisement