LOADING...
'World Milk Day': ప్రపంచ పాల దినోత్సవం.. నగర పాల అవసరాలపై ప్రత్యేక కథనం
ప్రపంచ పాల దినోత్సవం.. నగర పాల అవసరాలపై ప్రత్యేక కథనం

'World Milk Day': ప్రపంచ పాల దినోత్సవం.. నగర పాల అవసరాలపై ప్రత్యేక కథనం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిరోజూ తెల్లవారక ముందే భాగ్యనగరంలో పాల సరఫరా సందడి మొదలవుతుంది. నగరం పూర్తిగా మేల్కొనేలోపే వేలాది లీటర్ల పాలు వినియోగదారుల వద్దకు చేరుతుంటాయి. ఉదయం టీ నుంచి చిన్నారుల పోషకాహారం, వృద్ధుల ఆరోగ్య సంరక్షణ వరకు పాలు ప్రతి ఇంటి అవసరంగా మారాయి. 1.4 కోట్లకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో పాల వినియోగం నిరంతరం పెరుగుతోంది. జూన్‌ 1న ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా నగరానికి చేరుతున్న పాల సరఫరా వ్యవస్థ, పెరుగుతున్న డిమాండ్‌, అలాగే కల్తీ ప్రమాదంపై ప్రత్యేక కథనం.

వివరాలు 

ఇంట్లోనే పాల నాణ్యతను ఇలా పరీక్షించండి

పాల్లో కల్తీ ఉందో లేదో కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా ఇంట్లోనే తెలుసుకోవచ్చు. ఒక గాజు సీసాలో కొద్దిగా పాలు తీసుకుని అదే పరిమాణంలో నీటిని కలపాలి.తర్వాత సీసాను బాగా ఊపాలి. మందపాటి నురగ ఏర్పడి ఎక్కువసేపు అలాగే ఉంటే పాలు కల్తీ అయ్యి ఉండే అవకాశం ఉంది. స్వచ్ఛమైన పాలలో పల్చటి నురగ ఏర్పడి కొద్దిసేపటికే తగ్గిపోతుంది.మరో పరీక్ష కోసం పాలను మరిగించి చల్లారనివ్వాలి. అనంతరం అందులో అయోడిన్‌ సొల్యూషన్‌ కలిపితే నీలం రంగులోకి మారిన పాలు కల్తీ అయినట్లుగా భావించాలి. పాలు ఎక్కువకాలం నిల్వ ఉండేందుకు,అలాగే కొవ్వు శాతం అధికంగా ఉన్నట్లు చూపించేందుకు కొందరు యూరియా కలుపుతుంటారు. దీనిని గుర్తించేందుకు పాలలో కొద్దిగా కందిపప్పు పొడి వేసి బాగా కలపాలి.

వివరాలు 

రోజుకు 30 లక్షల లీటర్ల వినియోగం

ఆ తర్వాత ఎరుపు రంగు లిట్మస్‌ పేపర్‌ను అందులో ముంచితే దాని రంగులో మార్పు కనిపిస్తే యూరియా కలిపినట్లు అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ నగరంలో ప్రతిరోజూ సుమారు 30 లక్షల లీటర్ల పాలు వినియోగిస్తున్నట్లు అంచనా. ఇందులో దాదాపు 40 శాతం పాలు హోటళ్లు, కేఫేలు, స్వీట్‌ షాపులు, ఐస్‌క్రీమ్‌ తయారీ కేంద్రాలు, ఇతర ఆహార పరిశ్రమలకు సరఫరా అవుతున్నాయి. నగర అవసరాలను తీర్చేందుకు రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల నుంచి భారీగా పాల సరఫరా జరుగుతోంది.

Advertisement

వివరాలు 

కల్తీతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు

నగర జనాభా వేగంగా పెరుగుతున్నప్పటికీ పాల ఉత్పత్తి అదే స్థాయిలో పెరగడం లేదు. ఈ పరిస్థితిని కొందరు అక్రమ వ్యాపారులు అవకాశంగా మార్చుకుంటున్నారు. పాల పరిమాణం పెంచేందుకు నీరు కలపడం, చిక్కదనం కోసం పిండి పదార్థాలు ఉపయోగించడం, అలాగే డిటర్జెంట్‌, యూరియా వంటి చౌక రసాయనాలను కలపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇవి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫిర్యాదు చేయాలంటే.. పాలు లేదా పాల ఉత్పత్తుల్లో కల్తీ జరిగినట్లు అనుమానం వచ్చినా, నిర్ధారణ అయినా వినియోగదారులు 'మై క్యూర్‌' యాప్‌ ద్వారా ఆహార భద్రత విభాగానికి ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-2111 1111కు సమాచారం అందించవచ్చు.

Advertisement