LOADING...
Minister lokesh: విశాఖలో రూ.15 వేల కోట్లతో టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ డేటా సెంటర్‌.. 
విశాఖలో రూ.15 వేల కోట్లతో టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ డేటా సెంటర్‌..

Minister lokesh: విశాఖలో రూ.15 వేల కోట్లతో టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ డేటా సెంటర్‌.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో రూ.15 వేల కోట్ల వ్యయంతో 300 మెగావాట్ల సామర్థ్యమున్న హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) బుధవారం ఢిల్లీలోని అమెరికా-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య వేదికలో కుదిరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, జేసీ-2 వెంచర్స్‌ వ్యవస్థాపకులు,సీఈఓ,యూఎస్‌ ఐఎస్‌పీఎఫ్‌ ఛైర్మన్‌ జాన్‌ ఛాంబర్స్,అడోబీ సిస్టమ్స్‌ సీఈఓ, ఛైర్మన్‌ శంతను నారాయణ్, గూగుల్‌ చీఫ్‌ టెక్నాలజిస్ట్‌ ప్రభాకర్‌ రాఘవన్, ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్, అలాగే టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సహాధ్యక్షుడు సచిత్‌ అహుజా లు హాజరయ్యారు.

వివరాలు 

40 ఎకరాల్లో ప్రాజెక్టు 

ఈ సందర్భంలో ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి, టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ డేటా సెంటర్‌ ప్రాజెక్టు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 2028 నాటికి ఇది పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే, ప్రత్యక్షంగా 200-300 మంది, పరోక్షంగా 800-1,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ పెట్టుబడులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, ప్రణాళిక, డిజైన్, అలాగే డేటాసెంటర్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రధాన పరికరాలను (equipment) కూడా సమకూర్చనుంది. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా సంస్థకు భూమి కేటాయింపు, ప్రోత్సాహకాలు, ఇతర అవసరమైన సౌకర్యాలు అందించనుంది.

వివరాలు 

ప్రపంచ స్థాయి డిజిటల్‌ మౌలిక వసతులు అందించే ప్రాజెక్టు

టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సహాధ్యక్షుడు సచిత్‌ అహుజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అందిస్తున్న తీరప్రాంత అనుసంధానం, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ, అలాగే సమర్థవంతమైన పరిపాలనా విధానం తమ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. దీర్ఘకాలం పాటు ప్రపంచ స్థాయి డిజిటల్‌ మౌలిక వసతులు అందించే ఈ ప్రాజెక్టు ద్వారా అత్యున్నత నాణ్యత కలిగిన ఉద్యోగాలు సృష్టించనున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

వివరాలు 

రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి దోహదం: మంత్రి లోకేశ్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. విశాఖపట్నంను ప్రపంచ స్థాయి డేటా సెంటర్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్య సాధనలో ఈ ఒప్పందం కీలకంగా మారనుందని అన్నారు. దీని వల్ల రాష్ట్రం,డిజిటల్‌ వెన్నెముక మరింత బలపడుతుందని,యువతకు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. అదే విధంగా ఈ ప్రాజెక్టు ద్వారా ఇంధన, నెట్‌వర్క్‌, క్లౌడ్‌, సర్వీస్‌ రంగాలలో కొత్త పెట్టుబడులు రానున్నాయని తెలిపారు. టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ మౌలిక వసతుల అభివృద్ధిలో ప్రత్యేక గుర్తింపు పొందిందని అన్నారు. తన అనుబంధ సంస్థలకు మూలధన పరంగా మద్దతు ఇవ్వడం కోసం టిల్‌మాన్‌ సంస్థ ఇప్పటికే 12 బిలియన్‌ డాలర్లకు పైగా వనరులు సమీకరించినట్లు లోకేశ్‌ వెల్లడించారు.