
Nadendla Manohar: కొత్త రేషన్ కార్డులపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసుకోవాలన్న దృక్పథంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో రేషన్ వ్యవస్థలో ఏర్పాట్లు, రికార్డుల వివరాలను వెల్లడించిన ఆయన, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 60 శాతం రైస్ కార్డులకు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైస్ కార్డుల కోసం ఇప్పటి వరకు 16 లక్షల 13 వేల దరఖాస్తులు అందాయని చెప్పారు. కొత్తగా 9 లక్షల మందికి పైగా కార్డులు మంజూరయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా (1,45,97,000) రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయని, వీటి ద్వారా 4కోట్లకు పైగా పౌరులు లబ్ధి పొందుతున్నారని మంత్రి వివరించారు.
Details
డెబిట్ కార్డు సైజులో స్మార్ట్ రేషన్ కార్డులు
నూతనంగా అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులు డెబిట్ కార్డ్ సైజులో ఉంటాయని, వాటిపై ఎటువంటి రాజకీయ నాయకుల ఫొటోలు ఉండవు, కేవలం కుటుంబ అధిపతి (యజమాని) ఫోటో మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్డులు క్యూ ఆర్ కోడ్‌తో అనుసంధానించి, ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్డుల పంపిణీ ఆగస్టు 25 నుంచి 31 వరకు జరగనున్నదని చెప్పారు. అంతేగాక 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు హోమ్ డెలివరీ ద్వారా రేషన్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఏర్పడిన సమస్యలను గుర్తించిన ప్రభుత్వం, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని, అవసరమైతే తానే స్వయంగా అక్కడికి వెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని నాదెండ్ల తెలిపారు.
Details
ఇప్పటివరకు 93 లక్షల 46 వేల మందికి లబ్ధి
ఇక దీపం పథకానికి సంబంధించి వివరాలు వెల్లడిస్తూ, ఇప్పటివరకు 93 లక్షల 46 వేల మందికి ఈ పథకం లబ్ధి చేకూరిందని చెప్పారు. హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలతో చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 31 వరకు "దీపం 2" పథకం అమలులో ఉంటుందని తెలిపారు. అలాగే ఎన్టీఆర్, కృష్ణ జిల్లాల్లో దీపం పథకాన్ని డిజిటల్ వాలెట్ తో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు.