LOADING...
Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి

Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్లపై శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2025
05:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ గృహాల మంజూరు కోసం అనేక మంది లబ్ధిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం దశలవారీగా ఇళ్లను ఆమోదిస్తూ, విడతలుగా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. అదే సమయంలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, ఇటుకలు వంటి సామగ్రిని తక్కువ ధరకు అందించేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పూర్తైన కొన్ని గృహాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ గృహాల కోసం దరఖాస్తులు సమర్పించగా, ముందుగా సొంత ఇల్లు లేని నిరుపేదలకు ప్రాధాన్యతనిస్తూ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ఇంకా అవకాశం రాని వారు తమకు ఎప్పుడు గృహం మంజూరు అవుతుందా అంటూ నిరీక్షిస్తున్నారు.

వివరాలు 

వచ్చే ఏడాది మార్చి నాటికి..  రెండో విడత గృహ నిర్మాణ పనులు 

ఈ నేపథ్యంలో శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందిరమ్మ గృహాలపై తాజా సమాచారాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రెండో విడత గృహ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. త్వరలోనే లక్ష ఇళ్లకు గృహప్రవేశ కార్యక్రమాలు చేపడతామని, అలాగే 2026 మార్చి నాటికి మొత్తం మూడు లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

వివరాలు 

నో ప్రాఫిట్ - నో లాస్ విధానంలో మధ్యతరగతి ప్రజలకు అందించే యత్నం

ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి గృహాల నిర్మాణం కొనసాగుతోందని, సమీప భవిష్యత్తులో పట్టణ ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. పేదల కోసం గ్రౌండ్ ప్లస్ ఫోర్ విధానంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి గృహాల పంపిణీ చేయాలనే ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల నాలుగు వైపులా ఖాళీగా ఉన్న స్థలాల్లో ఒక్కో ప్రాంతంలో 10 వేల ఇళ్ల చొప్పున నిర్మించి, నో ప్రాఫిట్ - నో లాస్ విధానంలో మధ్యతరగతి ప్రజలకు అందించే యత్నం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి సంబంధించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు.

Advertisement

వివరాలు 

కేసీఆర్ ప్రభుత్వం తీరుపై విమర్శలు

ఇల్లు నిర్మించుకునేందుకు స్థలం కూడా లేని నిరుపేదలకు త్వరలోనే శుభవార్త అందించనున్నామని మంత్రి అన్నారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి తప్పకుండా గృహం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో హౌసింగ్ శాఖ పూర్తిగా అవినీతికి లోనైందని, అర్ధాంతరంగా వదిలేసిన గృహ నిర్మాణ పనులన్నింటినీ ఇప్పుడు ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేస్తామని చెప్పారు.

Advertisement

వివరాలు 

హిల్ట్ పాలసీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం

ఒక్క విడతలో ఇళ్లిచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వంగా తాము వ్యవహరించమని, అర్హులందరికీ పూర్తిస్థాయిలో గృహాలు నిర్మించి అందిస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా హిల్ట్ పాలసీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు మేలు చేసే దిశగా తమ ప్రభుత్వం సాగుతోందని, గత ప్రభుత్వ విధానాలను అనుసరించే ప్రశ్నే లేదని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు.

Advertisement