అయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు సర్కార్ నిషేధం: నిర్మలా సీతారామన్
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు తమిళనాడు ఆలయ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు 'దినమలర్' వార్తాపత్రిక కథనాన్ని ఉటంకిస్తూ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. భజనలు నిర్వహించడం, పేదలకు భోజనం పెట్టడం, ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని చూడకుండా స్టాలిన్ ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ప్రత్యేక ప్రార్థనలను డీఎంకే ప్రభుత్వం అడ్డుకుంటున్నదని తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం దేవాలయాల్లో భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించే ప్రణాళికలను అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
బీజేపీ ఆరోపణలను ఖండించిన డీఎంకే ప్రభుత్వం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ చేస్తున్న ఈ ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. సీతారామన్ ఆరోపణలను తమిళనాడులోని హిందూ మత, ధర్మాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు, తీవ్రంగా ఖండించారు. శ్రీరాముడి పేరుతో భక్తులకు ప్రత్యేక పూజలు, అన్నదానం, ప్రసాదం పంపిణీ చేయడాన్ని శాఖ నిషేధించలేదని ఆయన స్పష్టం చేశారు. సేలంలో జరుగుతున్న డీఎంకే యువజన విభాగం సదస్సు నుంచి 'ప్రజల దృష్టిని మళ్లించేందుకే' ఈ వదంతులు ప్రచారం చేశారని శేఖర్‌బాబు ఆరోపించారు.