Earthquakes:తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన స్వల్ప భూప్రకంపనలు
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నగరం, జగ్గయ్యపేట పట్టణం తదితర ప్రాంతాల్లో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం, హయత్‌నగర్ వంటి ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్, అలాగే ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ప్రకంపనలు సుమారు మూడు సెకన్ల పాటు కొనసాగాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లలో ఉన్నవారు కూడా ఆందోళన చెందారు.
ములుగు కేంద్రంగా భూకంపం
హైదరాబాద్‌లోని బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నందిగామలో సుమారు 7 సెకన్ల పాటు భూమి కంపించగా, గుడివాడలో రెండు సెకన్లపాటు ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 7.20 గంటల నుంచి 7.26 గంటల మధ్య పలు సందర్భాల్లో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో ములుగు జిల్లాలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో అత్యంత ప్రభావం కనిపించింది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో కూడా ప్రకంపనలు తీవ్రంగా నమోదయ్యాయి. 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఈ స్థాయిలో భారీ భూకంపాలు చోటుచేసుకోవడం విశేషం.