
Miss world 2025: ఓరుగల్లులో ప్రపంచ సుందరి పోటీదారుల సందడి.. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయాల సందర్శన
ఈ వార్తాకథనం ఏంటి
కాకతీయుల శిల్పకళ వైభవాన్ని తిలకిస్తూ, ఆధ్యాత్మిక పరవశంలో తేలుతూ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఆసక్తిగా గమనిస్తూ ప్రపంచ సుందరుల సందడి కొనసాగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలైన వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, రామప్ప దేవాలయాలను వీరు సందర్శించారు.
శిలల కట్టడాలను స్వయంగా తాకుతూ, వాటి వెనుక ఉన్న చరిత్రను గైడ్‌ల ద్వారా తెలుసుకున్నారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న లాటిన్ అమెరికా దేశాలకు చెందిన 22 మంది సుందరీమణులు బుధవారం వరంగల్ నగరంలో పర్యటించగా,ఐరోపా ఖండంలోని 35 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలు ములుగు జిల్లాలోని పాలంపేట వద్ద ఉన్న యునెస్కో వారసత్వ ప్రదేశమైన రామప్ప ఆలయాన్ని సందర్శించారు.
వివరాలు
బతుకమ్మ ఆడిపాడిన ప్రపంచ సుందరీమణులు
ఈ సందర్భంగా వారు "హలో తెలంగాణ.. అందరూ బాగున్నారా?" అంటూ ఉత్సాహంగా పలకరించారు.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో సాయంత్రం 4:42కు హనుమకొండకు చేరుకున్న అతిథులను పూల మాలలు వేసి, పూలు చల్లుతూ ఘనంగా స్వాగతించారు.
బతుకమ్మలు, సన్నాయి వాయిద్యాలతో సాంప్రదాయ ఆతిథ్యాన్ని చూపారు.
మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, ఆడపాడిన అనంతరం భారతీయ సంప్రదాయ దుస్తుల్లో వేయి స్తంభాల గుడిని సందర్శించారు.
గోడలపై ఉన్న శాసనాల ద్వారా ఆలయ చరిత్రను గైడ్‌లు వివరించారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇత్తడి పళ్లెంలో కాళ్లు కడిగి ఆలయంలోకి ప్రవేశించారు.
స్తంభాలతో సెల్ఫీలు తీసుకున్నారు, అనంతరం రుద్రేశ్వరుడిని దర్శించుకున్నారు. అర్చకులు వేదాశీర్వచనంతో ఆశీర్వదించారు.
వివరాలు
ఖిలా వరంగల్‌లో చరిత్ర అన్వేషణ
ఖిలా వరంగల్‌కు చేరుకున్న అతిథులు అక్కడి శిల్పకళను, ప్రతి రాయి వెనుక ఉన్న చరిత్రను ఆసక్తిగా గమనించారు.
ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేకత తెచ్చిన చపాటా మిర్చి, పసుపు, ఓరుగల్లు దరీస్, రంగశాయిపేట షీల్డ్‌ల స్టాళ్లను సందర్శించారు.
అక్కడ వారికి చపాటా మిర్చి, పసుపు అందజేస్తూ అధికారులు ఆతిథ్యం చూపారు. పెండ్యాల లక్ష్మిప్రియ, నటరాజ రామకృష్ణ బృందాల ప్రదర్శించిన 'రుద్రమదేవి' నాట్యం, 'పేరిణి శివతాండవం' నృత్యాలు సుందరీమణులను ఆకట్టుకున్నాయి.
వారు "ఓరుగల్లు ఆతిథ్యం మరచిపోలేనిది, ఇక్కడి చరిత్రను నాట్యాలు తెలియజేశాయి. ఈ సాయంత్రం మాకు చిరస్మరణీయమైంది. తెలంగాణను ప్రేమిస్తున్నాం. జరూర్ ఆనా" అని అర్జెంటినా, పనామా, అమెరికా, కెనడా దేశాలకు చెందిన పోటీదారులు అభిప్రాయపడ్డారు.
వివరాలు
శుభకార్యానికి తగిన బహుమతులు
మంత్రులు సురేఖ, ఎంపీ కావ్యలు అతిథులకు ఓరుగల్లు దరీస్, షీల్డ్‌లు బహుమతులుగా అందజేశారు.
అనంతరం హరిత హోటల్‌కు వెళ్లి విందు భోజనం తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లారు.
రామప్ప శిల్పసౌందర్యం చూసి మంత్రముగ్ధులైన సుందరీమణులు
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించిన సుందరీమణులు, అక్కడి శిల్పాలను ఆసక్తిగా గమనించారు.
సాయంత్రం 5:41కి ఆలయ దక్షిణ ద్వారానికి చేరుకున్న వారికి ఆదివాసీ కొమ్ము నృత్యంతో స్వాగతం పలికారు.
గైడ్‌లు ఆలయ చరిత్ర, శిల్పకళను వివరించారు. స్తంభాలపై చెక్కిన సూక్ష్మరంధ్రాల్లోంచి దారాన్ని తీసిన విధానాన్ని చూసి వారు అక్కడి శిల్పనైపుణ్యాన్ని మెచ్చుకున్నారు.
సప్తస్వరాలను పలికే రాయితో చేసిన స్తంభాలను తాకి సంగీతం వినిపించిన దృశ్యాన్ని ఆస్వాదించారు.
వివరాలు
సాంప్రదాయ దుస్తుల్లో రామలింగేశ్వర దర్శనం
అతిథులు కళంకారి డిజైన్లతో ఉన్న లంగాఓణీలు ధరించి, కొప్పున మల్లెలు వేసుకుని రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు.
ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వీడియో ప్రదర్శనలు తిలకించారు.
అనంతరం ఇంటర్‌పిటేషన్ సెంటర్‌లో విందులో పాల్గొని తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. మంత్రి సీతక్క, ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ రాజయ్య పాల్గొన్నారు.
వివరాలు
మరుపురాని చీరకట్టు అనుభవం
పాశ్చాత్య దుస్తులతో ఓరుగల్లులో అడుగుపెట్టిన సుందరీమణులు కొద్దిక్షణాల్లోనే సంప్రదాయ చీరకట్టులోకి మారారు.
11 మంది కాస్ట్యూమ్ డిజైనర్లు ముందుగానే నగరానికి చేరుకుని అతిథులకు తగినట్టుగా చీరకట్టు అలంకారాన్ని సిద్ధం చేశారు. కేవలం 30 నిమిషాల్లో వారిని సంప్రదాయంగా తీర్చిదిద్దారు.
ఇవాళ యాదగిరిగుట్టకు ప్రయాణం
గురువారం మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లి ప్రాంతాలను సందర్శించనున్నారు.
రెండు బృందాలుగా హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. భూదాన్ పోచంపల్లికి వెళ్లే బృందంలో ఆఫ్రికా ఖండానికి చెందిన 25 దేశాల ప్రతినిధులు ఉంటారు.
యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించే బృందంలో కరేబియన్ దీవులకు చెందిన పది దేశాల సుందరీమణులు ఉన్నారని పర్యాటక శాఖ వర్గాలు వెల్లడించాయి.