Thaneeru Harish Rao: ఇదిగో రాజీనామా.. మీరు కూడా రాజీనామా లేఖతో రండి.. రేవంత్‌కి సవాల్ విసిరిన హరీష్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌పై మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ నేత తన్నీరు హరీష్ రావు స్పందించారు. తన రాజీనామా లేఖతో శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌కు చేరుకున్నారు. అనంతరం హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, రాజీనామా లేఖను పీఠంపై ఉంచారు. అనంతరం అక్కడే ఉన్న పాత్రికేయులకు రాజీనామా లేఖను అందజేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9నాడు రైతులకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామన్నారని తెలిపారు.
లేఖను నా రాజీనామాగా పరిగణించి ఆమోదించండి
ఆగస్టు 15ను లోగా హామీలు నెరవేర్చకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని, ఒకవేళ హామీలు నెరేవేరిస్తే.. నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాను. సవాల్ కు కట్టుబడి నేను ఈ రాజీనామా ప్రతిపాదన లేఖను మీ ముందు ఉంచుతున్నాను. 2024 ఆగస్టు 15లోగా పైన పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేసిన పక్షంలో ఈ లేఖను నా రాజీనామాగా పరిగణించి ఆమోదించాలని కోరుతున్నానని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం బాండ్ పేపర్లపై సంతకాలు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తుందని సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని సీఎంకు గుర్తు చేశారు.