AP Mlc Elections: రేపే ఎమ్మెల్సీ ఓటింగ్... తప్పులు చేయొద్దు, ఈ జాగ్రత్తలు పాటించండి!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఓటు హక్కును వినియోగించుకునే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అప్పుడే వారు వేసే ఓటు చెల్లుబాటు అవుతుంది. సాధారణ ఎన్నికలకూ, ఎమ్మెల్సీ ఎన్నికలకూ తేడా ఉంటుంది. సాధారణ ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలను ఈవీఎం ద్వారా ఎన్నుకుంటారు.
అందులో ఓటర్లు బటన్ నొక్కి తమ ఓటు హక్కును వినియోగించుకోగలరు.
కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, పంచాయతీ ఎన్నికల మాదిరిగా బ్యాలెట్ పేపర్‌పై ముద్ర వేయడం కూడా కుదరదు.
Details
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి?
1.పోలింగ్ కేంద్రానికి గుర్తింపు కార్డు, ఓటరు స్లిప్ తీసుకెళ్లాలి.
2.పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు జాబితాలో పేరు, సీరియల్ నంబర్ చూసుకోవాలి.
3.జాబితాలో పేరు దగ్గర ఓటరు సంతకం చేయాలి. అనంతరం పోలింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్ అందిస్తారు.
4. అధికారులు ఇచ్చిన ప్రత్యేక పెన్నుతోనే ఓటు వేయాలి.
5. బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పేరు, ఫోటోలు మాత్రమే ఉంటాయి. పార్టీ గుర్తులు ఉండవు.
6. ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న ఖాళీ బాక్స్‌లో "1" అనే సంఖ్యను మాత్రమే వ్రాయాలి.
7. మిగిలిన అభ్యర్థులకు 2, 3, 4, 5... ఇలా ప్రాధాన్యత సంఖ్యలను కేటాయించవచ్చు.
8. బ్యాలెట్ పేపర్‌ను అధికారుల సూచనల ప్రకారం మడత పెట్టాలి.
Details
ఓటు వేయేటప్పుడు చేయకూడని తప్పులు
1. అభ్యర్థులందరికీ ఒకే నంబర్ వేయకూడదు.
2. ఒక అభ్యర్థికి ఇచ్చిన ప్రాధాన్యత సంఖ్యను మరో అభ్యర్థికి ఇవ్వకూడదు.
3. ప్రాధాన్యత సంఖ్యలను ఇంగ్లీష్(one, two,three) లేదా రోమన్లలో (I, II, III) రాయకూడదు. అంకెల్లోనే రాయాలి.
4. అధికారుల సూచనలను పాటించకుండా బ్యాలెట్ పేపర్ మడత పెడితే, ఓటు చెల్లదు.
5.ఖాళీ బ్యాలెట్ పేపర్ వేయకూడదు. 6. పెన్నుతో గాఢంగా రాయడం, చుక్కలు, టిక్కులు పెట్టడం వల్ల ఓటు చెల్లదు.
7. అభ్యర్థి పేరు, బాక్స్ పక్కన కాకుండా మరోచోట అంకె రాసినా ఓటు రద్దవుతుంది.
8."1"వ ప్రాధాన్యత నంబర్ లేకుండా మిగిలిన సంఖ్యలు రాసినా ఓటు చెల్లదు. 9. అంకెలు కాకుండా ఇతర గుర్తులు (✔️, సున్నాలు) పెట్టడం తగదు.
Details
ఎమ్మెల్సీ పోటీ పరిస్థితి
ఉమ్మడి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి (యూటీఎఫ్), టీడీపీ-జనసేన మద్దతుదారుడు పాకలపాటి రఘువర్మ (ఏపీటీఎఫ్), బీజేపీ మద్దతుతో గాదె శ్రీనివాసుల నాయుడు (పీఆర్‌టీయూ) పోటీలో ఉన్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 3,14,984 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Details
టీడీపీ, పీడీఎఫ్ మధ్య పోటాపోటీ
ప్రధానంగా పేరాబత్తుల రాజశేఖర్ (టీడీపీ), దిడ్ల వీర రాఘవులు (పీడీఎఫ్) మధ్య హోరాహోరీ పోటీ జరుగనుంది.
అలాగే, ఉమ్మడి కృష్ణా-గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం 25 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,47,116 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.
ఇక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ (టీడీపీ), కేఎస్ లక్ష్మణరావు (పీడీఎఫ్) మధ్య ప్రధాన పోటీ నెలకొంది.