మోచా తుఫాను వచ్చేస్తోంది: దేశంలోని ఏయే ప్రాంతాలు ప్రభావితం అవుతాయంటే?
ఎండాకాలంలో ఎండలు కొట్టకుండా వర్షాలు పడటం అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. గతకొన్ని రోజులుగా వాతావరణంలో కనిపిస్తున్న మార్పులు, ఈ సంవత్సరం ఎండాకాలం అనేది లేదేమోనన్న సందేహాలను లేవనెత్తుతున్నాయి. దేశమంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా మోచా తుఫాను గురించి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం కారణంగా తుఫాను సంభవిస్తుందని పేర్కొంది. బంగాళాఖాతంలోని అల్పపీడనం, మే 9వ తేదిన తీరం దాటే అవకాశం ఉందని, అందువల్ల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ అల్పపీడన ప్రభావం, పశ్చిమ బెంగాల్, ఒడిషా, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద ఉండనుందని వాతావరణ విభాగం హెచ్చరించింది.
మే 7నుండి 11వరకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు
మే 7వ తేదీన ఏర్పడే అల్పపీడనం, మే 9 లేదా 10వ తేదీలోగా తీరం దాటే అవకాశం ఉందని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదని, ఆల్రెడీ సముద్రం వైపు వెళ్ళిన వాళ్ళు మే 7వ తేదీలోగా తీరాన్ని చేరుకోవాలని చెబుతున్నారు. మే 7 నుండి 11వ తేదీలలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులోని చెన్నైలో ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసాయి. తమ రాష్ట్రాల్లో తుఫాను ప్రభావంపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో తుఫానుకు ఒక్కో పేరును ఒక్కో దేశం సూచిస్తుంది. మోచా అనే పేరును యెమెన్ దేశం సూచించింది.