Loading...
'One Day, One University':యువతకు చేరువయ్యేందుకు మోదీ సర్కార్‌ కొత్త కార్యక్రమం.. 'వన్‌ డే.. వన్‌ వర్సిటీ'! 
'వన్‌ డే.. వన్‌ వర్సిటీ'!

'One Day, One University':యువతకు చేరువయ్యేందుకు మోదీ సర్కార్‌ కొత్త కార్యక్రమం.. 'వన్‌ డే.. వన్‌ వర్సిటీ'! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
08:20 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు వంటి అంశాలపై విద్యార్థులు, యువత వరుసగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జన్‌ జెడ్‌ యువతకు మరింత చేరువయ్యేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 'వన్‌ డే, వన్‌ యూనివర్సిటీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర మంత్రులు ప్రతిరోజూ ఒక విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థులు, యువతతో నేరుగా ముఖాముఖి సమావేశమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకోవడంతోపాటు, వారితో మరింత సన్నిహితంగా మమేకం కావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

వివరాలు 

విద్యార్థులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన.. పర్యటనల బాధ్యతలు వీరికే

అంతేకాకుండా విద్యార్థులు, యువత సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల గురించి కూడా మంత్రులు వారికి వివరించనున్నారు.

ప్రభుత్వ విధానాలు, యువత కోసం అందుబాటులో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ఈ పర్యటనలను ఉపయోగించుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

'వన్‌ డే, వన్‌ యూనివర్సిటీ' కార్యక్రమానికి సంబంధించి విశ్వవిద్యాలయాలతో సమన్వయం చేయడంతోపాటు, కేంద్ర మంత్రుల పర్యటనలను పర్యవేక్షించే బాధ్యతలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయలకు ప్రభుత్వం అప్పగించినట్లు సమాచారం.

వివరాలు 

కేంద్ర కేబినెట్‌ సమావేశంలోనూ ఈ కార్యక్రమంపై చర్చ

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలోనూ ఈ కార్యక్రమంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే విశ్వవిద్యాలయాలతోపాటు డీమ్డ్‌ యూనివర్సిటీలను కలిపి సుమారు 1,300 వరకు వర్సిటీలు ఉన్నట్లు అంచనా.

వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ యువతతో మమేకమయ్యే కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.

ADVERTISEMENT