Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
భారత రైల్వే శాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు వందే భారత్ రైళ్లను ప్రారంభించింది. ఆగస్టు 31న ప్రధాని నరేంద్ర మోదీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇవి మీరట్ నుండి లక్నో, మధురై నుండి బెంగళూరు, చెన్నై నుండి నాగర్‌కోయిల్ వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. చెన్నై-నాగర్‌కోయిల్ వందే భారత్ రైలు ద్వారా ప్రయాణికులు రెండు గంటల కంటే ఎక్కువ సమయం ఆదా చేసుకోవచ్చు.
1300 రైల్వే స్టేషన్లో పునరుద్ధరణ పనులు
అదే విధంగా, మీరట్-లక్నో మార్గంలో వందే భారత్ రైలు ప్రయాణ సమయాన్ని ఒక గంట మేర తగ్గించనుంది. రైల్వే బడ్జెట్‌లో ఈ సంవత్సరం రూ.2.5 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. రైల్వే లైన్ల విద్యుదీకరణ, కొత్త మార్గాల నిర్మాణం వంటి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని మోదీ చెప్పారు. త్వరలో వందే భారత్‌లో స్లీపర్ వెర్షన్ కూడా రానుందని ఆయన తెలిపారు. నమో భారత్ రైలు, వందే మెట్రో వంటి కార్యక్రమాలు ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంలో, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడంలో కీలకంగా మారుతున్నాయని మోడీ పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా 1300కి పైగా రైల్వే స్టేషన్లను పునరుద్ధరిస్తున్నామని చెప్పారు.