UAE's first Hindu Temple: యూఏఈలో మొదటి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన మోదీ.. దాని ప్రత్యేకతలు ఇవే
యూఏఈలోని మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. బోచాసన్ నివాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ (BAPS - బీఏపీఎస్) ఆలయాన్ని యూఏఈ రాజధాని అబుదాబిలోని 'అల్ వక్బా' అనే నిర్మించారు. ఇటీవలే అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన ప్రధాని చేతుల మీదుగా.. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఆలయ ప్రారంభోత్సవం జరిగింది. ఆలయం ప్రత్యేకతలు.. ఆలయాన్ని 27 ఎకరాల్లో నిర్మించారు. ఆలయ నిర్మాణానికి దాదాపు 400మిలియన్ యూఏఈ ఎమిరేట్స్ దిర్హామ్‌లు ఖర్చు చేశారు. హైవేకి ఆనుకుని ఉన్న అల్ వక్బా అనే ప్రదేశం అబుదాబి నుంచి 30 నిమిషాల దూరంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి 1997లో అప్పటి బీఏపీఎస్ అధిపతి స్వామి మహారాజ్ ప్రణాళిక రచించారు.
ఆలయాన్ని ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ
భూమిని విరాళంగా యూఏఈ ప్రభుత్వం
ఆలయ నిర్మాణ కోసం ఆగస్ట్ 2015లో యూఏఈ ప్రభుత్వం భూమిని విరాళంగా ఇచ్చింది. రెండు సంవత్సరాల తర్వాత, అంటే 2017లో అబుదాబి యువరాజు భూమిని బీఏపీఎస్ మఠానికి అందజేశారు. 2018లో ప్రధాని మోదీ అబుదాబిలో హిందూ దేవాలయం నిర్మాణంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ 2019లో యూఏఈలో మొదటి హిందూ దేవాలయానికి పునాది రాయి పడింది. నాడు దేవాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు, చూసేందుకు దాదాపు 5,000 మంది భక్తులు తరలివచ్చారు. శంకుస్థాపన తర్వాత, భారతదేశంలోని మూడు ప్రధాన పవిత్ర నదులైన గంగ, యమునా, సరస్వతి నుంచి తెచ్చిన నీటిని నిర్మాణానికి ఉపయోగించే రాళ్లను సంప్రోక్షణ చేశారు.
40,000 క్యూబిక్ అడుగుల పాలరాయితో నిర్మాణం
2020లో ఆలయంలో రాళ్లపై శిల్పాలను చెక్కే పని ప్రారంభమైంది. సాంప్రదాయ రాక్ టెంపుల్ శైలిలో ఈ ఆలయ నిర్మాణాన్ని డిజైన్ చేశారు. ఆలయ ప్రాంగణంలో గ్రంథాలయం, తరగతి గది, కమ్యూనిటీ సెంటర్, సమావేశ స్థలం, యాంఫీథియేటర్‌కూ నిర్మించారు. 2023, ఆగష్టులో ఆలయం నిర్మాణం చివరి దశకు వచ్చింది. ఆలయం నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని 'ఎడారిలో వికసించే కమలం' అని యూఏఈలోని హిందువులు పిలవడం మొదలు పెట్టారు. అబుదాబిలో నిర్మించిన ఈ హిందూ దేవాలయం 108అడుగుల ఎత్తు ఉంటుంది. 40,000క్యూబిక్ అడుగుల పాలరాయితో దీన్ని నిర్మించారు. 1,80,000క్యూబిక్ అడుగుల ఇసుకరాయిని నిర్మాణంలో ఉపయోగించారు. 18,00,000ఇటుకలను ఉపయోగించారు. ఆలయంలో 300సెన్సార్లను ఏర్పాటు చేశారు. BAPS హిందూ దేవాలయం ప్రారంభోత్సవ వేడుకలు ఫిబ్రవరి 21వరకు కొనసాగనున్నాయి.