Putin India Tour: రేంజ్ రోవర్ పక్కనపెట్టి ఫార్చ్యూనర్‌లో మోదీ,పుతిన్
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఘన స్వాగతం పలికారు. పాలం విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు ఒకే వాహనంలో ప్రయాణించగా, ఆ కారు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. సాధారణంగా తాను ఉపయోగించే విలాసవంతమైన రేంజ్ రోవర్‌ను పక్కనపెట్టి, మోదీ ఒక సాదాసీదా టయోటా ఫార్చ్యూనర్‌లో పుతిన్‌ను తన నివాసానికి తీసుకెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వారు ప్రయాణించినది టయోటా ఫార్చ్యూనర్ సిగ్మా 4 ఎంటీ (Toyota Fortuner Sigma 4 MT)మోడల్ వాహనం కాగా, దీనికి MH01EN5795 అనే మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ఉంది. ఈ బీఎస్-6 కేటగిరీ వాహనం 2024 ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ అయిందని తెలుస్తోంది.
వివరాలు
మోదీ ఈ వాహనాన్ని ఎంపిక చేయడంపై సర్వత్రా ఆసక్తి..
ఈ కారుకు జారీ చేసిన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ 2039 ఏప్రిల్ వరకు చెల్లుబాటు కావడం విశేషం. రష్యా అధ్యక్షుడిని తీసుకెళ్లేందుకు మోదీ ఈ వాహనాన్ని ఎంపిక చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే సందర్భంలో, పుతిన్ కూడా తనకు సాధారణంగా ఉపయోగించే ఆరస్ సెనేట్ లిమోసిన్ వాహనాన్ని వినియోగించకుండా, ఫార్చ్యూనర్‌లోనే ప్రయాణించేందుకు సమ్మతించడం విశేషంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో ప్రయాణాలు చేసే ఈ ఇద్దరు దేశాధినేతలు, భద్రతా మార్గదర్శకాలకు భిన్నంగా ఒక సాధారణ వాహనంలో ప్రయాణించడం గమనార్హమైంది.
వివరాలు
లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి..
ఇక, రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా పుతిన్ గురువారం భారత్‌కు చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ప్రధాని మోదీ ఆయనకు స్వయంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసానికి చేరుకుని, అక్కడ పుతిన్ గౌరవార్థం మోదీ విందు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఇద్దరు నాయకుల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుండగా, ఈ సమావేశంలో భారత్-రష్యాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదరకున్నట్లు సమాచారం.