LOADING...
PM Modi: మహిళా రిజర్వేషన్లపై మోదీ సంచలన నిర్ణయం.. 2011 గణాంకాలతోనే అమలు!
మహిళా రిజర్వేషన్లపై మోదీ సంచలన నిర్ణయం.. 2011 గణాంకాలతోనే అమలు!

PM Modi: మహిళా రిజర్వేషన్లపై మోదీ సంచలన నిర్ణయం.. 2011 గణాంకాలతోనే అమలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 13, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించే 'నారీ శక్తి వందన అధినియమ్' అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది. సోమవారం విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ చట్టాన్ని అమలు చేయడంపై ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో ప్రత్యేక చర్చ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 2023లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. స్పష్టమైన గడువు లేకుండా చట్టాన్ని అమలు చేయడం సరైంది కాదని, అందుకే 2029 నాటికి అమలు చేయాలనే ప్రతిపక్షాల అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించిందన్నారు.

వివరాలు

కీలక మార్పులను పరిశీలిస్తున్న కేంద్రం

చట్టంలోని సాంకేతిక, రాజ్యాంగ పరమైన అంశాలపై నిరంతరం మేధోమథనం జరుగుతోందని, నిపుణుల సలహాలను కూడా తీసుకుంటున్నామని తెలిపారు. అమలులో జాప్యం జరగకుండా ఉండేందుకు కేంద్రం కీలక మార్పులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రారంభంలో కొత్త జనాభా లెక్కలు నియోజకవర్గాల పునర్విభజన పూర్తైన తర్వాతే రిజర్వేషన్లు అమలు చేయాలని భావించారు. అయితే జనాభా గణన ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలును మరింత వాయిదా వేయకూడదని కేంద్రం నిర్ణయించింది. అందుకే 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.

వివరాలు

ఆ ఆలోచన నాలుగు దశాబ్దాలుగా ఉంది

మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచన గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోందని ప్రధాని పేర్కొన్నారు. ఈ దిశగా ఎన్నో తరాల కృషి ఉందని గుర్తు చేశారు. మన పార్లమెంట్ ఒక కొత్త చరిత్ర సృష్టించే దశలో ఉంది. సామాజిక న్యాయం అనేది నినాదంగా కాకుండా, మన పని విధానంలో భాగంగా ఉండాలని అన్నారు. సమానత్వంతో కూడిన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ చట్టం కీలక అడుగుగా నిలుస్తుందని ప్రధాని అభివర్ణించారు.

Advertisement