Loading...
Telangana Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌కు వేగం.. 28 గ్రామాల్లో 1,869 ఎకరాల భూసేకరణ!
దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌కు వేగం.. 28 గ్రామాల్లో 1,869 ఎకరాల భూసేకరణ!

Telangana Regional Ring Road: దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌కు వేగం.. 28 గ్రామాల్లో 1,869 ఎకరాల భూసేకరణ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) దక్షిణ భాగం పనుల్లో వేగం పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమైంది. షాద్‌నగర్, కందుకూరు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 28 గ్రామాల్లో 75.67 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కోసం మొత్తం 1,869.30 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందులో షాద్‌నగర్ డివిజన్ పరిధిలోనే 12 గ్రామాలు ఉండగా.. మిగిలిన గ్రామాలు కందుకూరు, ఇబ్రహీంపట్నం డివిజన్లలో ఉన్నాయి. శనివారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వచ్చే ఏడాది మార్చిలోపు భూసేకరణ పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత ప్రభుత్వ భూముల వివరాలను సేకరించి, అవసరమైన చోట పడావు, పట్టా భూములను తీసుకోనున్నారు.

వివరాలు

మూడు దశల్లో భూసేకరణ.. అభ్యంతరాలకు అవకాశం

మరోవైపు హెచ్‌ఎండీఏ అధికారులు తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను సమాంతరంగా రూపొందించనున్నారు.

మొత్తం 1,869.30 ఎకరాల భూసేకరణను మూడు దశల్లో పూర్తి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.

మొదటి దశ: ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 28 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారు. భూయజమానులు, స్థానికుల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు.

రెండో దశ: భూముల సర్వే నిర్వహించి, వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తారు. చర్చల అనంతరం డ్రాఫ్ట్ డిక్లరేషన్ నోటిఫికేషన్ విడుదల చేసి అవార్డు ప్రకటిస్తారు.

మూడో దశ: పరిహారం పంపిణీ ప్రక్రియ చేపడతారు. ఆర్డీవో కార్యాలయం ద్వారా భూయజమానులకు నగదు చెల్లిస్తారు. పరిహారం తీసుకోని వారి మొత్తాన్ని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వద్ద డిపాజిట్ చేస్తారు.

వివరాలు

రెండు రేడియల్ రోడ్లతో కనెక్టివిటీ

దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టులో రెండు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ల అనుసంధానం కీలకంగా మారింది.

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొంగరకలాన్-ఆమనగల్లు మధ్య 42 కిలోమీటర్ల రతన్ టాటా రేడియల్ రోడ్డు-1 నిర్మించనున్నారు.

అలాగే బుద్వేల్-కొడంగల్ మధ్య 81 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు-2 చేపట్టనున్నారు.

ఈ రెండు రహదారుల ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), శంషాబాద్ విమానాశ్రయం, భారత్ ఫ్యూచర్ సిటీతో పాటు దక్షిణ ప్రాంత గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి.

ADVERTISEMENT