Monsoon: రైతులకు వాతావరణ విభాగం బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు
సకాలంలో వానలు పడటం చాలా ముఖ్యం. వానాకాలంలో సరైన మోతాదులో వర్షపాతం ఉండడం సమతుల్యతను సూచిస్తుంది. వర్షపాతం లోపం లేదా అధికం వల్ల కరువు లేదా వరదలు వస్తాయి. వాతావరణ మార్పులు,ప్రత్యేకంగా రైతులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇప్పుడు,వాతావరణ విభాగం మరోసారి ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉన్నట్టు హెచ్చరిస్తోంది. ఈ నెల మధ్యలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్ప పీడనం ప్రభావంతో సెప్టెంబర్ చివరి వరకు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ వర్షాల అధికత యాసంగి పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.వీటిలో వరి,పత్తి,సోయాబీన్, మొక్కజొన్న,ధాన్యాలు ముఖ్యమైనవి. సాధారణంగా ఈ పంటలు సెప్టెంబర్ మధ్యలో పండుతాయి. ఈ పంటలకు వర్షాల అధికత దెబ్బతీస్తుందని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటి వరకు సగటు కంటే 7 శాతం అధిక వర్షపాతం
అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతింటే,ఆహార ధరలు పెరగడమో,తేమతో పంటలకు ఇబ్బందులు రావడమో జరుగవచ్చు. అయితే,వర్షాలు కొన్ని పంటలకు ప్రయోజనం కూడా కలిగిస్తాయి. భూమి తేమను గోధుమలు,శనగలు వంటి పంటలు ఉపయోగించుకోగలవని పేర్కొంటున్నారు. భారతదేశంలో రుతుపవనాలు సాధారణంగా జూన్‌లో ప్రారంభమై, సెప్టెంబర్ చివర నాటికి ఉపసంహరణ పూర్తి అవుతుంది. వర్షపాతం ఆధారంగా దేశంలోని వ్యవసాయం, నీటి వనరులు కీలకంగా ఆధారపడతాయి. 70 శాతం నీటి అవసరాలను ఈ సీజన్‌లో పడే వర్షాలతోనే తీర్చుకుంటారు. జూన్ నుండి మొదలైన ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సగటు కంటే 7 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అక్టోబర్ మధ్యవరకు వర్షాలు కొనసాగితే, పంటలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.