
Monsoon: సాధారణ తేదీ కంటే వారం ముందుగానే నైరుతి రుతుపవనాలు.. నేడు, రేపు ఏపీలో భారీ వర్షాలు!
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి రుతుపవనాలు ఈసారి మరింత చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.
రాబోయే నాలుగు నుండి ఐదు రోజుల్లో ఈ రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులు, దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది.
సాధారణంగా మే 21 నాటికి అండమాన్ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తుంటాయి.
అయితే ఈసారి వారంరోజుల ముందుగానే అక్కడికి చేరాయి.
ఫలితంగా నికోబార్ దీవుల్లో గత 24 గంటల నుంచి మోస్తరు నుంచి తీవ్ర వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అక్కడ వర్షపాతం పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
తదుపరి 24 గంటల్లో నికోబార్ దీవుల్లో మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
వివరాలు
అండమాన్ సమీప ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
ఈ ప్రాంతాల్లో వర్షాలు క్రమంగా కొనసాగుతుండటంతో, నైరుతి రుతుపవనాలు మే 13 నాటికి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ & నికోబార్ దీవుల కొన్ని భాగాల్లోకి మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
తర్వాతి 4-5 రోజుల్లో రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం,మాల్దీవులు,కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, మొత్తం అండమాన్ & నికోబార్ దీవులు, అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు మరింతగా వ్యాపించే అవకాశం ఉంది.
ఇది నైరుతి రుతుపవనాల ప్రభావంతో అండమాన్ సమీప ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే అల్పపీడనంగా మారే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఈశాన్య భారతదేశంలోనూ ఉరుములు,మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో చిరుజల్లులు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.
మంగళవారం, బుధవారం ఉత్తర కోస్తా,రాయలసీమ ప్రాంతాల్లో,గురువారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక రాబోయే ఐదు రోజుల్లో పశ్చిమ, మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.
అంతేకాకుండా ఈశాన్య భారతదేశంలోనూ ఉరుములు,మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అండమాన్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అచ్చుతచ్చుగా ముందుకు సాగుతూ కేరళను తాకే అవకాశం ఉంది.
అయితే అది కనీసం రెండు వారాల సమయం పడుతుంది.మే 27నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
వివరాలు
కొంకణ్, గోవా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం
ఇక గుజరాత్ రాష్ట్రంలో మోస్తరు వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్లు నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు.
మే 13, 14 తేదీలలో కొంకణ్, గోవా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మే 14 నుంచి 16 వరకు మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడలో, మే 13న కూడా ఈ రెండు ప్రాంతాల్లో 50-60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.