LOADING...
Montha Cyclone: దిశ మార్చుకుని.. తెలంగాణపై విరుచుకుపడిన మొంథా తుపాను
దిశ మార్చుకుని.. తెలంగాణపై విరుచుకుపడిన మొంథా తుపాను

Montha Cyclone: దిశ మార్చుకుని.. తెలంగాణపై విరుచుకుపడిన మొంథా తుపాను

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
09:05 am

ఈ వార్తాకథనం ఏంటి

అనూహ్యంగా తెలంగాణ వైపు దూసుకువచ్చిన మొంథా తుపాన్ రాష్ట్రవ్యాప్తంగా భీకర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి మొదలైన భారీ వర్షాలు బుధవారం సాయంత్రం వరకూ ఆగకుండా కురిసాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలు జలదిగ్బంధమైపోయాయి. వాగులు, వంకలు ఉప్పొంగిపోగా రహదారులు ఏరులమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు, చెట్లు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్లు కూలిపోయి, గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. మొదట ఆంధ్ర తీరంలోకి దూసుకొచ్చిన ఈ తుపాను తరువాత అనూహ్యంగా తెలంగాణ వైపు మలుపు తిరిగింది. దీంతో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ దిశగా వెళ్తుందని భావించగా, బుధవారం ఉదయం తరువాత దిశ మారింది. ఉత్తరాంధ్ర-తెలంగాణ సరిహద్దు మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కదిలింది.

వివరాలు 

దెబ్బతిన్న  వరి, పత్తి, మక్క పంటలు 

ఈ ప్రభావంతో హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం సాయంత్రానికి తుపాను బలహీనమై వాయుగుండంగా మారింది. గురువారానికి మరింత బలహీనపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో వరి, పత్తి, మక్క పంటలు దెబ్బతిన్నాయి. కోసిన పంట వరదకు కొట్టుకుపోగా, రైతులు తేమశాతం పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైళ్లు, బస్సులు నిలిచిపోయి, బస్టాండ్లలో నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వివరాలు 

తొమ్మిదిగంటల వర్షంతో వరంగల్ వణికింది 

ఒకేరోజు భీకర వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసి ముద్దైంది. భీమదేవరపల్లి మండలంలో 41.2 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. కల్లెడ్‌, పర్వతగిరి మండలంలో 34.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎనిమిది గంటల్లోనే ఇంత భారీ వర్షం పడటం అరుదైన రికార్డు. నెక్కొండ, సంగెం, ఖిలా వరంగల్, వర్ధన్నపేట, రాయపర్తి, గీసుగొండ, చెన్నారావుపేట మండలాల్లో కుండపోత కురిసింది. హనుమకొండ, జనగామ జిల్లాల్లో వర్ష ధాటికి జనజీవనం స్తంభించింది. భీమదేవరపల్లి, హసన్‌పర్తి, దామెర మండలాల్లో గ్రామాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి, డోర్నకల్, గార్ల మండలాల్లోనూ పరిస్థితి దారుణంగా మారింది. గ్రేటర్ వరంగల్ నగరంలో కాలనీలు, అండర్‌పాస్‌లు నీటమునిగాయి. ఎంజీఎం ఆసుపత్రి, బస్టాండ్ పరిసరాలు జలదిగ్బంధమయ్యాయి.

వివరాలు 

నల్గొండ, సూర్యాపేటల్లో వరద విజృంభణ 

రాయపర్తి మండలం మైలారలోని కోళ్లఫారంలో వరద నీరు చేరడంతో ఐదు వేల కోళ్లు చనిపోయాయి. మొరిపిరాల సమీప లింగాలకుంటలో 15 గొర్రెలు కొట్టుకుపోయాయి. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వాగులు ఉప్పొంగాయి. మూసీ నది పొంగిపొర్లడంతో రహదారులు మూసివేశారు. పాఠశాలలు నీట మునిగాయి. దేవరకొండ సమీప గిరిజన గురుకుల పాఠశాలలో నీరు చేరడంతో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, ఏఎస్పీ మౌనికలు విద్యార్థులను సురక్షితంగా తరలించారు. కొండమల్లేపల్లి, గౌరికుంట తండాల్లో ఇళ్లలోకి నీరు చొరబడింది. మూసీ ప్రాజెక్టు గేట్లు తెరిచి నీరు విడుదల చేశారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని కస్తూర్బా పాఠశాల నీటమునిగింది. మద్దిరాల సమీపంలో చెట్టు కూలడంతో కోట లక్ష్మీనారాయణ (49) మృతి చెందారు. చందంపేట మండలం తెల్‌దేవరపల్లిలో 18.58 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

వివరాలు 

నాగర్‌కర్నూల్‌ గుండె గుభేల్‌ 

మంగళవారం రాత్రి నాగర్‌కర్నూల్ జిల్లా భీకర వర్షాలతో వణికిపోయింది. ఉప్పునుంతల మండలంలో 20.8 సెం.మీ, అమ్రాబాద్‌లో 19.7, అచ్చంపేటలో 17.8 సెం.మీ వర్షం నమోదైంది. జిల్లాలో 15 మండలాలు కుండపోత వర్షాలతో తడిసి ముద్దయ్యాయి. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలు కూడా భారీ వర్షాలను ఎదుర్కొన్నాయి. కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. తాడూరు మండలంలో చలికి తట్టుకోలేక 30 గొర్రెపిల్లలు చనిపోయాయి. ఉప్పునుంతల సమీప లత్తీపూర్ వద్ద దిండి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో శ్రీశైలం-హైదరాబాద్ రహదారి మూసివేశారు.

వివరాలు 

భయపెడుతున్న మున్నేరు ఉద్ధృతి  

ఖమ్మం జిల్లాలో మున్నేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఆకేరు వాగు నుంచి భారీగా నీరు చేరడంతో మున్నేరు నీటిమట్టం 19.20అడుగులకు పెరిగింది. అధికారులు అప్రమత్తమై పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు.కొణిజర్ల మండలం అంజనాపురం-ఏన్కూరు మండలం జన్నారం మధ్య వాగు దాటుతుండగా డీసీఎం వాహనం కొట్టుకుపోయి డ్రైవర్ మురళి(30)గల్లంతయ్యాడు. 16 జిల్లాలకు వరద హెచ్చరిక వాతావరణ శాఖ ప్రకారం 16జిల్లాల్లో వరద ముప్పు పొంచి ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆదిలాబాద్,నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాల్లో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించే అవకాశం ఉందని తెలిపారు. ప్రాజెక్టులు, చెరువులు నిండిపోవడంతో దిగువ ప్రాంతాల వారికి అప్రమత్తత సూచించారు.

వివరాలు 

రెడ్‌ అలర్ట్ జారీ 

బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాలకు రెడ్‌ ఎలర్ట్‌ జారీ అయింది. అదనంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా.

వివరాలు 

గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు దృష్టి 

వర్షాల కారణంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సరైన ఆహారం, ఆరోగ్య సంరక్షణ అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గురుకుల సొసైటీ కార్యదర్శులు పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఆర్సీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, వర్షాలు తగ్గే వరకు రాత్రిపూట కనీసం నలుగురు సిబ్బంది విధుల్లో ఉండాలని సూచించారు.