LOADING...
CYCLONE MONTHA: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. 28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం
28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం

CYCLONE MONTHA: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం.. 28 రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారే దిశగా సాగుతోంది. ప్రస్తుతం అది పోర్ట్‌బ్లెయిర్‌కి 670 కిలోమీటర్లు, చెన్నైకి 720 కిలోమీటర్లు, కాకినాడకు 780 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 790 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాలపూర్‌కు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. సోమవారం ఉదయానికి ఈ వాయుగుండం నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం ఉదయానికి అది తీవ్రమైన తుపానుగా మారి, అదే రోజు రాత్రికి కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దాదాపు 12 గంటలపాటు ఈ తుపాను తీవ్రంగా కొనసాగి, ఆ తరువాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని సూచించింది.

వివరాలు 

జిల్లాల వారీగా హెచ్చరికలు

తుపాను ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మంగళవారం, బుధవారం రోజుల్లో గంటకు 110కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తుపాను పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ సోమవారం 7 జిల్లాలకు రెడ్ అలర్ట్,16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఇంకా 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే మంగళవారం రోజున 14 జిల్లాలకు రెడ్,8 జిల్లాలకు ఆరెంజ్,4 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు ప్రకటించింది. సముద్రం అలజడిగా మారిన కారణంగా గురువారం వరకు మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లరాదని విశాఖపట్టణం తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.

వివరాలు 

సహాయక చర్యలు సిద్ధం 

విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మొదటి నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అదనంగా కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు కూడా సమాచారం పంపినట్లు వెల్లడించింది. తుపాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ 9 ఎస్డీఆర్‌ఎఫ్‌ (SDRF), 7 ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలను జిల్లాల్లో మోహరించింది. మరికొన్ని బృందాలు ప్రధాన కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండి, అధికారులు సూచించిన జాగ్రత్తలను పాటించాలని సూచించింది.

వివరాలు 

జిల్లాల వారీగా వర్షాల అంచనాలు 

సోమవారం: కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు యానాంలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, నంద్యాల జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడవచ్చు. కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

వివరాలు 

జిల్లాల వారీగా వర్షాల అంచనాలు 

మంగళవారం: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు యానాంలో అత్యంత భారీ వర్షాలు. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు; చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని అంచనా.

వివరాలు 

జిల్లాల వారీగా వర్షాల అంచనాలు 

బుధవారం: శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌ జిల్లాలతో పాటు యానాంలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.