Nara Lokesh: ఏపీలో 'మొంథా' విధ్వంసం.. నష్టం రూ.6,352 కోట్లు… అమిత్ షాకు నివేదిక సమర్పించిన మంత్రి లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో మోంథా తుపాను భారీ విధ్వంసానికి కారణమైందని, మొత్తం రూ. 6,352 కోట్ల నష్టం జరిగినట్లు రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అనిత వివరించారు. ఈ మేరకు వారు మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలసి తుపాను నష్టాలపై సమగ్ర నివేదికను సమర్పించారు. పార్లమెంట్ హాల్‌లోని అమిత్ షా ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు కూడా హాజరయ్యారు. తుపాను ప్రభావంతో ప్రజలు భారీ ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు వెల్లడించారు.
Details
తుపాను ప్రభావిత ప్రాంతాలు, తక్షణ సాయం
మొత్తం 3,109 గ్రామాలు తుపాను వల్ల ప్రభావితమయ్యాయని నివేదికలో పేర్కొన్నారు. ప్రతి ప్రభావిత కుటుంబానికి ఏపీ ప్రభుత్వం తరఫున రూ. 3వేలు తక్షణ సాయం అందజేసినట్లు లోకేశ్ తెలిపారు. రంగాల వారీగా నష్టం వివరాలు వ్యవసాయ & అనుబంధ రంగాలు: రూ. 271 కోట్లు రోడ్లు, మౌలిక వసతులు: రూ. 4,324 కోట్లు విద్యుత్ రంగం: రూ. 41 కోట్లు నీటి వనరుల ప్రాజెక్టులు: రూ. 369 కోట్లు శాశ్వత నిర్మాణాలకు: రూ. 1,302 కోట్లు
Details
రూ.902 కోట్లు అవసరం
మొత్తం నష్టాల ప్రకారం, ఎన్డీఆర్‌ఎఫ్ మార్గదర్శకాల ఆధారంగా తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణకు రూ. 902 కోట్లు అవసరం ఉన్నట్లు లోకేశ్ వివరించారు. మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం ఇప్పటికే సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపిందని కూడా అమిత్ షాకు తెలియజేశారు. తరువాత రాష్ట్ర మంత్రులు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కూడా కలిశారు. తుపానుతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాల నివేదికను అందజేసి, పరిహారం త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.