Hyderabad: హైదరాబాద్‌లో మరిన్ని స్కైవాక్‌లకు జీహెచ్‌ఎంసీ నిర్ణయం.. త్వరలో ట్రిపుల్‌ఐటీ, విప్రో కూడళ్లలో నిర్మాణం
పాదచారుల సౌలభ్యం కోసం సమస్యాత్మక కూడళ్లలో ఆకాశ మార్గాలను నిర్మించడానికి జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. హెచ్‌సిటి ప్రాజెక్టు కింద,హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూ.25 కోట్ల వ్యయంతో ఉప్పల్ కూడలిపై స్కై వాక్ నిర్మాణం పూర్తయింది. ఇది వరంగల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, నాగోల్, మెట్టుగూడ మార్గాలు, ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్‌ను కలుపుతూ రూపొందించబడింది. ఈ నడక మార్గంలో అన్ని వైపులా మెట్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో రహేజా మైండ్‌స్పేస్ ప్రాంగణంలో నిర్మించిన స్కై వాక్ కూడా పాదచారుల నుంచి మంచి ఆదరణ పొందింది. మరిన్ని కూడళ్లలో ఇలాంటి స్కై వాక్‌లు అవసరమని జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
రెండు పైవంతెనలు, రెండు అండర్‌పాస్‌లకు అనుమతి
తాజాగా హెచ్‌సిటి ప్రాజెక్టు కింద పురపాలక శాఖ రూ.5,942 కోట్ల అంచనా వ్యయంతో 23 పనులకు పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో, మొదట గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ కూడలిలో రూ.459 కోట్లతో రెండు పైవంతెనలు, రెండు అండర్‌పాస్‌లు, విప్రో చౌరస్తాలో రూ.158 కోట్లతో ఓ పైవంతెన, ఐసీఐసీఐ చౌరస్తాలో అండర్‌పాస్ నిర్మాణాలకు అనుమతి లభించింది. మియాపూర్, అల్విన్ కాలనీ, ఆరాంఘర్ కూడళ్లలో కూడా స్కై వాక్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం.