Loading...
Srisailam: రోజుకు 12 టీఎంసీలకు పైగా శ్రీశైలంలోకి జలాలు.. వేగంగా పెరుగుతున్న నిల్వ
రోజుకు 12 టీఎంసీలకు పైగా శ్రీశైలంలోకి జలాలు.. వేగంగా పెరుగుతున్న నిల్వ

Srisailam: రోజుకు 12 టీఎంసీలకు పైగా శ్రీశైలంలోకి జలాలు.. వేగంగా పెరుగుతున్న నిల్వ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీశైలానికి కృష్ణా జలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు విడుదలవుతుండటంతో కృష్ణమ్మ జలాలు శ్రీశైలం జలాశయానికి నిరంతరంగా చేరుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 12 టీఎంసీలకు పైగా నీటి నిల్వ శ్రీశైలంలో పెరుగుతోంది. ఆలమట్టి ప్రాజెక్టుకు ప్రస్తుతం 1.03 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, దిగువకు 1.11 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు కూడా 1.11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద 1.56 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 1.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

వివరాలు

849.70 అడుగులకు చేరిన  శ్రీశైలం జలాశయం నీటిమట్టం

ఈ ప్రవాహాల ప్రభావంతో ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 849.70 అడుగులకు చేరుకుంది.

మరోవైపు గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ప్రస్తుతం 10,358 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ 31.92 టీఎంసీలకు చేరుకోగా, పూర్తి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు. కడెం ప్రాజెక్టు నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 8,326 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అదే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.

వివరాలు

సమ్మక్కసాగర్‌ బ్యారేజీకి 5.54 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

సుందిళ్ల బ్యారేజీకి 3 వేల క్యూసెక్కులు, అన్నారం బ్యారేజీకి 11 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అక్కడి నుంచి కూడా అంతే మొత్తాన్ని మేడిగడ్డ వైపు విడుదల చేస్తున్నారు.

ప్రాణహిత, గోదావరి నదుల ప్రవాహాలు కలిపి మేడిగడ్డ బ్యారేజీకి 5.52 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది.

సమ్మక్కసాగర్‌ బ్యారేజీకి 5.54 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, అదే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.

భద్రాచలం ఎగువన ఉన్న సీతమ్మసాగర్‌ బ్యారేజీ వద్ద 8.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.

భద్రాచలం వద్ద గత రెండు రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి ప్రస్తుతం శాంతించి సాధారణ స్థితికి చేరుకుంటోంది.

ADVERTISEMENT