వివాహం,శుభకార్యాల్లో ప్లే చేసే పాటలకు కాపీరైట్ వర్తించదు: కేంద్రం కీలక ప్రకటన
సినిమా పాటల కాపీరైట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వివాహం, ఇతర వేడుకల్లో ప్లే చేసే సినిమా పాటలకు కాపీ రైట్ వర్తించదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వివాహ కార్యక్రమాల సమయంలో ఈ పాటల ప్రదర్శన విషయంలో కాపీ రైట్ ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. శుభకార్యాల్లో పాటలను ప్లే చేయడం అనేది కాపీ రైట్ కిందకు రాదని, ఇది కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 52 (1) (za) స్ఫూర్తికి విరుద్ధమని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్, ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) స్పష్టం చేసింది.
వేడుకల్లో ప్లే చేసే పాటలకు రాయల్టీలను డిమాండ్ చేయకూడదు: డీపీఐఐటీ
వివాహం అనేది కాపీరైట్ చట్టం కింద మతపరమైన వేడుకగా పరిగణించబడుతుందని డీపీఐఐటీ పేర్కొంది. రాయల్టీని ఆశించే వారు కాపీరైట్ చట్టంలోని పేర్కొన్న నిబంధనలకు విరుద్ధమైన చర్యలకు దూరంగా ఉండాలని డీపీఐఐటీ సూచించింది. వివాహ కార్యక్రమాలు లేదా మతపరమైన, అధికారిక వేడుకల్లో ప్లే చేసే పాటలకు రాయల్టీలను డిమాండ్ చేయకూడదని స్పష్టం చేసింది. వివాహ వేడుకల్లో సినిమా పాటలను ప్లే చేయడాన్ని కాపీరైట్ ఉల్లంఘన నుంచి మినహాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఆతిథ్య పరిశ్రమ, ప్రత్యేకించి ఈవెంట్‌ల సమయంలో కాపీరైట్ ఉల్లంఘనల కారణంగా వివిధ సంస్థల నుంచి కాపీరైట్ సమస్యలను ఎదుర్కొంటోంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆతిథ్య పరిశ్రమకు భారీ ఊరట లభించింది.