Mumbai: ముంబై భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భాండుప్ పశ్చిమ రైల్వే స్టేషన్ రోడ్ వద్ద రివర్స్ తీస్తున్న BEST బస్సు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న పలువురిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందగానే ముంబై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, BEST అధికారులు, 108 అంబులెన్స్‌లు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు.
వివరాలు
ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రిలో మరో ముగ్గురు మృతి
ప్రమాదం జరిగిన సమయంలో స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు,విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్న ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్‌లో ఒక్కసారిగా తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. జనాన్ని నియంత్రించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారితో పాటు మృతులను రాజావాడీ బీఎంసీ ఆస్పత్రి, ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రులకు తరలించారు. రాజావాడీ ఆస్పత్రికి తీసుకువచ్చిన వారిలో 31 ఏళ్ల గుర్తుతెలియని మహిళ మృతిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 51 ఏళ్ల ప్రశాంత్ లాడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎం.టి. అగర్వాల్ ఆస్పత్రిలో మరో ముగ్గురిని వైద్యులు మృతులుగా ప్రకటించారు. ప్రస్తుతం మొత్తం తొమ్మిది మంది గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రివర్స్ తీస్తున్న BEST బస్సు అదుపు తప్పి ప్రజలను ఢీకొట్టిన ఘటన
BEST bus ran over 4-5 people (count unconfirmed) at Bhandup West Station Road area in Mumbai pic.twitter.com/jzoImgpEP2
— Rahul (@rahulrsawant) December 29, 2025