Maoist Doctor: దండకారణ్యంలో మావోయిస్టుల ప్రాణాలు కాపాడిన.. 'మిస్టరీ డాక్టర్' ఎవరు ?
ఈ వార్తాకథనం ఏంటి
వైద్యుడిగా శిక్షణ పొందిన ఆయన ఉద్యమ ఆలోచనలతో అడవుల బాట పట్టారు. మౌలిక వసతులు లేని దండకారణ్య అరణ్యాల్లో పనిచేస్తూ అనేక మంది మావోయిస్టుల ప్రాణాలను నిలబెట్టిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే డాక్టర్ రఫీక్. నిఘా వ్యవస్థలకు కూడా దొరకకుండా ఏళ్ల తరబడి మావోయిస్టు దళంలో సేవలందించిన ఈ 'మిస్టరీ మావోయిస్టు డాక్టర్' గురించిన వివరాలు ఇప్పటికీ రహస్యమే. అయితే తాజాగా లొంగిపోయిన ఓ మావోయిస్టు వెల్లడించిన వివరాలతో ఈ డాక్టర్ పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. భద్రతా బలగాలు నిర్వహిస్తున్న నిరంతర ఆపరేషన్ల ప్రభావంతో ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయి సాధారణ జీవనంలోకి వస్తున్నారు.
వివరాలు
రఫీక్‌పై కీలక విషయాలు వెల్లడించిన వెంకటరాజు అలియాస్ చందు
వీరిలో ఎం.వెంకటరాజు అలియాస్ చందు అనే మావోయిస్టు డాక్టర్ రఫీక్‌పై కీలక విషయాలు వెల్లడించాడు. "ఈ ఉద్యమంలో చేరిన పూర్తి స్థాయి వైద్యుడు ఆయనొక్కరే. పలువురు అగ్రస్థాయి నేతలకు చికిత్స చేశారు.సరిపడా పరికరాలు లేకపోయినా అత్యవసర పరిస్థితుల్లో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి"అని చందు చెప్పినట్లు భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. పంజాబ్‌కు చెందిన రఫీక్ అలియాస్ మణ్‌దీప్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత సీపీఐ(మావోయిస్టు) పార్టీలో చేరాడు. కొన్నేళ్లు దళంలో కొనసాగుతూ ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని దండకారణ్యంలో ప్రత్యేక వైద్య వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ప్రథమ చికిత్స, తూటా గాయాలకు కుట్లు వేయడం,శరీరంలో ఇరుక్కున్న బుల్లెట్లను తొలగించడం వంటి వైద్య నైపుణ్యాలపై మావోయిస్టు సభ్యులకు, స్థానిక ఆదివాసీలకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం.
వివరాలు
టార్చ్‌లైట్ వెలుతురులోనే శస్త్రచికిత్స
భద్రతా బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్టు ఛాతీలోకి తూటా దూసుకెళ్లి గుండెకు అతి సమీపంలో ఇరుక్కున్న సందర్భంలో, టార్చ్‌లైట్ వెలుతురులోనే శస్త్రచికిత్స చేసి ఆ బుల్లెట్‌ను డాక్టర్ రఫీక్ విజయవంతంగా తొలగించారని చందు వివరించాడు. అబూజ్‌మఢ్ ప్రాంతంలోని మావోయిస్టు ప్రధాన కేంద్ర జోన్‌లో ఆయన పనిచేసేవారని, అలాగే అడవుల్లో వైద్య సదుపాయాలు అందని ఆదివాసీలకు కూడా చికిత్స అందించారని తెలిపాడు. డాక్టర్ రఫీక్ పేరు 2013లో తొలిసారి భద్రతా దళాల దృష్టికి వచ్చింది. ఆ సమయంలో అరెస్టైన కొందరు మావోయిస్టులు ఈ రహస్య వైద్యుడి గురించి ప్రస్తావించడంతో ఇంటెలిజెన్స్ విభాగం విచారణ చేపట్టింది.
వివరాలు
2016లోనే రఫీక్ దండకారణ్యాన్ని విడిచిపెట్టి జార్ఖండ్‌కు..
అయినప్పటికీ ఆయనకు సంబంధించిన స్పష్టమైన వివరాలు లభించలేదు. 2018లో రఫీక్ భార్య రింకీ సీనియర్ మావోయిస్టు కమాండర్ ప్రశాంత్ బోస్‌కు చికిత్స అందించిందనే సమాచారం పోలీసులకు చేరింది. అయితే అప్పటికే, అంటే 2016లోనే రఫీక్ దండకారణ్యాన్ని విడిచిపెట్టి జార్ఖండ్‌కు వెళ్లిపోయినట్లు నిఘా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం కూడా ఆయన అదే రాష్ట్రంలోనే ఉన్నారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.