CJ Roy: సీజే రాయ్ మృతి చుట్టూ మిస్టరీ.. విభిన్న వాదనలు, 'ట్యాక్స్ టెర్రరిజం' ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలో ప్రముఖ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ (CJ Roy) ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో పాటు 'ట్యాక్స్ టెర్రరిజం' ఆరోపణలు తెరపైకి రావడంతో రాజకీయ దుమారం కూడా మొదలైంది. రాయ్ చివరి గంటల్లో ఏం జరిగిందనే అంశంపై పరస్పర విభిన్న కథనాలు వినిపించడంతో, వీటిని స్పష్టత చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. 57 ఏళ్ల సీజే రాయ్ జనవరి 30న మధ్యాహ్నం లాంగ్‌ఫోర్డ్ టౌన్‌లోని కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయంలో తన ప్రైవేట్ చాంబర్‌లో మృతిచెందారు.
Details
లైసెన్సు గన్ తో కాల్చుకొని ఆత్మహత్య
ఆయన వద్ద ఉన్న లైసెన్సు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడైంది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ ఆదాయపన్ను శాఖ అధికారులు ఉన్నట్లు తెలిసింది. గతంలో జరిగిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలపై తుది పరిశీలన కోసం ఐటీ అధికారులు కార్యాలయంలో ఉన్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Details
విచారణపైనే ప్రశ్నలు
ఈ ఘటనపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తీవ్రంగా తప్పుపట్టారు. కుటుంబ సభ్యుల అంత్యక్రియలు పూర్తికాకముందే, అధికారిక ఫిర్యాదు కూడా లేకుండానే ఎస్‌ఐటీ ఏర్పాటు చేయడం తొందరపాటు చర్యగా ఆయన విమర్శించారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది. ఇక మరోవైపు ఆదాయపన్ను శాఖ చర్యలపై 'ట్యాక్స్ టెర్రరిజం' ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, సీజే రాయ్ మరణానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి నిజానిజాలు వెలికితీయాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐటీ దర్యాప్తు కీలకంగా మారింది.