LOADING...
Andhra Pradesh: సోలార్‌ ప్రాజెక్టులకు నాబార్డ్‌-ఏడీబీ రుణం.. 804 మెగావాట్ల సోలార్‌ యూనిట్లకు ఎల్‌వోఏ జారీ 
సోలార్‌ ప్రాజెక్టులకు నాబార్డ్‌-ఏడీబీ రుణం.. 804 మెగావాట్ల సోలార్‌ యూనిట్లకు ఎల్‌వోఏ జారీ

Andhra Pradesh: సోలార్‌ ప్రాజెక్టులకు నాబార్డ్‌-ఏడీబీ రుణం.. 804 మెగావాట్ల సోలార్‌ యూనిట్లకు ఎల్‌వోఏ జారీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో గృహాలపై సౌర విద్యుత్‌ ఫలకాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టును నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ విద్యుత్‌ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నాబార్డ్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సహకారంతో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని ఆయన తెలిపారు. సచివాలయం నుంచి డిస్కంల సీఎండీలు, ఏడీబీ, నాబార్డ్‌ ప్రతినిధులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు. హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో రూఫ్‌టాప్‌ సోలార్‌ యూనిట్లను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నాం. పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన కింద ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు.

Details

రాష్ట్రవ్యాప్తంగా  3.88 లక్షల రూఫ్‌టాప్‌ సోలార్‌ యూనిట్లు

లబ్ధిదారులకు అందించాల్సిన సబ్సిడీకి కావాల్సిన నిధులను నాబార్డ్‌ రుణ రూపంలో డిస్కంలకు అందిస్తోందని సీఎస్‌ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.88 లక్షల రూఫ్‌టాప్‌ సోలార్‌ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఈ పనులను ఈపీసీ (EPC) విధానంలో నిర్వహించేందుకు కాంట్రాక్టర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 804 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టులకు సంబంధించి ఎల్‌వోఏ (Letter of Award) జారీ చేయగా, మరిన్ని 200 మెగావాట్ల ప్రాజెక్టుల టెండర్‌ ప్రక్రియ తుది దశలో ఉన్నదన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వినియోగం గణనీయంగా పెరగడంతో పాటు, విద్యుత్‌ ఖర్చు తగ్గడం, పర్యావరణ పరిరక్షణకు దోహదం అవుతుందని సీఎస్‌ విజయానంద్‌ పేర్కొన్నారు.