
నాగాలాండ్: 60ఏళ్ల అసెంబ్లీ చరిత్రలో మహిళకు దక్కని ప్రాతినిధ్యం; ఈసారైనా అబల గెలిచేనా?
ఈ వార్తాకథనం ఏంటి
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నెల 27(సోమవారం) ఒకే దశలో మొత్తం 60అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అయితే 1963లో ఏర్పడిన నాగాలాండ్ అసెంబ్లీకి ఇంతవరకు ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా ఎన్నిక కాకపోవడం గమనార్హం. 2023 ఎన్నికల్లో అయినా అబలలకు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కుతుందా? అని ఆ రాష్ట్ర మహిళలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుత ఎన్నికల్లో నాగాలాండ్ అసెంబ్లీ బరిలో వివిధ పార్టీల నుంచి నలుగురు మహిళలు బరిలో నిలిచారు. ఎన్‌డీపీపీ నుంచి హెకానీ జఖాలు, సల్హౌతునో క్రూసే, కాంగ్రెస్ నుంచి రోసీ థామ్సన్, బీజేపీ నుంచి కహులీ సెమా పోటీ చేస్తున్నారు.
నాగాలాండ్
లోక్‌సభ, రాజ్యసభలో దక్కిన ప్రాతినిధ్యం; అయితే ఒక్కసారి మాత్రమే
అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యేలు ఎన్నిక కాలేకపోయినా, రాష్ట్రం నుంచి మాత్రం పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం ఉంది. అది కూడా ఒకసారి మాత్రమే. 1977లో రానో షైజా ఎంపీగా గెలిచారు. 2022లో ఫాంగ్నాన్ కొన్యాక్‌ను బీజేపీ రాజ్యసభకు పంపింది. వీరు మాత్రమే రాష్ట్రంనుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు.
రాష్ట్రంలో ఇంతవరకు అసెంబ్లీలో మహిళా ప్రాతినిధ్యం లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నాగాలాండ్ గిరిజన సమాజంలో పురుషాధిక్యం ఎక్కవ. మహిళల హక్కులు చాలా పరిమితంగా ఉంటాయి. ఇక్కడి మహిళలకు పూర్వీకుల నుంచి భూమి, ఆస్తి వారసత్వంగా పొందే హక్కు లేదు.
ప్రతి ఎన్నికల్లోనూ మహిళలు పోటీ చేస్తున్నా, రాష్ట్రంలో వారి పట్ల ఉండే చిన్న చూపే వారికి విజయం దక్కకుండా చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.