Andhra Pradesh: నల్లమల తవ్వకాల్లో అమరావతి చరిత్రకు కొత్త ఆధారాలు.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కు వివరాలు
ఈ వార్తాకథనం ఏంటి
నల్లమల అటవీ ప్రాంతంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్‌ఐ) నిర్వహించిన పురావస్తు అన్వేషణలో అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని వెల్లడించే కీలక శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో జూన్ 10న చేపట్టిన తవ్వకాల సందర్భంగా తెలుగు లిపిలో చెక్కబడిన 13వ శతాబ్దానికి చెందిన అరుదైన శాసనాన్ని అధికారులు గుర్తించారు. ఈ శాసనం ప్రకారం,కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి కాలంలో సేనాధిపతిగా సేవలందించిన మల్లికార్జున నాయకుడు.. అప్పటి ధాన్యకటకం, నేటి అమరావతిలోని బుద్ధదేవుని ఆలయానికి కృష్ణానది ఒడ్డున ఉన్న వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్లు నమోదు చేసినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ శాసనం అమరావతి చారిత్రక వైభవానికి మరో బలమైన ఆధారంగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
వివరాలు
ఈ చారిత్రక ఆధారాలు అమరావతి చరిత్రపై అసత్య ప్రచారాలకు సరైన సమాధానం
తవ్వకాలలో లభించిన ఈ శాసనం సహా ఇతర పురావస్తు ఆధారాల వివరాలను పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ శాఖ అధికారులు మంగళవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వివరించారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించారు. అమరావతి చరిత్రను ప్రతిబింబించే ఇలాంటి శాసనాలు వెలుగులోకి రావడం ఎంతో విశేషమని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని అమరావతి చరిత్రపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాలకు ఇలాంటి చారిత్రక ఆధారాలు సరైన సమాధానం ఇస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర వారసత్వ సంపదను గుర్తించి, పరిరక్షించే బాధ్యతను కూటమి ప్రభుత్వం సమర్థంగా నిర్వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.