Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు గల్లంతు.. యోగి సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్ల జాబితాలో భారీ సంఖ్యలో హిందువుల పేర్లు గల్లంతయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. సుమారు 1.27 కోట్ల మంది హిందువుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరును ఓటర్ల జాబితాలో చేర్చేలా బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. శుక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR) ప్రక్రియపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని యోగి సూచించారు. బూత్ స్థాయి అధికారులు (BLOs)తో సమన్వయం చేసుకుంటూ అర్హులైన ఓటర్లందరి పేర్లు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వివరాలు
28 పట్టణ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో బీజేపీకి ఇబ్బందులు
ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిపోవడం వల్ల రాష్ట్రంలోని 28 పట్టణ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనపడుతోందని యోగి వ్యాఖ్యానించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో 16కోట్లకు పైగా ఓటర్లు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం సుమారు 13కోట్ల మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారని తెలిపారు.
పంచాయతీ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో 66 లక్షల మంది పేర్లు లేవని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న 55 లక్షల మంది పేర్లు కూడా ఓటర్ల జాబితాలో కనిపించడం లేదని ఆరోపించారు.
అలాగే 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 4.5 లక్షల మంది యువ ఓటర్ల పేర్లు సైతం జాబితాలో లేవని చెప్పారు.
వివరాలు
అర్హులైన ఓటర్ల పేర్లు చేర్చేలా చర్యలు తీసుకోవాలి
గతంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఉత్తర్‌ప్రదేశ్ ఓటర్ల జాబితాలో కొత్తగా కేవలం 4 లక్షల మంది పేర్లు మాత్రమే చేరాయని యోగి తెలిపారు.
ఈసారి అర్హులైన ఓటర్ల పేర్లన్నీ జాబితాలో ఉండేలా బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.
హిందూ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాధ్యత తీసుకోవాలని అన్నారు.
వివరాలు
ఎస్‌ఐఆర్ తర్వాత 2.04 కోట్లకు పైగా పేర్ల తొలగింపు
మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఓటర్ల జాబితా నుంచి 2.04 కోట్లకు పైగా పేర్లు తొలగించారు.
ఈ తొలగింపులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. తొలగించిన పేర్లలో మహిళల సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం.
అదే సమయంలో కొత్తగా 84 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చారు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్ తుది ఓటర్ల సంఖ్య 13,39,84,792కు చేరింది.
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు అంశాలు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి.