Balakrishna : హిందూపురంలో ఆసక్తికర సన్నివేశం.. ఫోన్ కాల్'తో అంగన్ వాడీలను చల్లార్చిన బాలయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని అంగన్‌వాడీలు ముట్టడించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న బాలయ్య, అంగన్‌వాడీ కార్యకర్తలకు ఫోన్ చేసి మాట్లాడారు. రెండు వారాల నుంచి రోడ్డెక్కి ఆందోళన చేపట్టి ఒక విప్లవం తీసుకొచ్చారని, పాదయాత్రలో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తానని మాయమాటలు చెప్పి జగన్ మోసం చేశారన్నారు. ఉచిత పథకాలు, ఉచిత హామీలను నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. వచ్చే వారంలో హిందూపురానికి వస్తానని, అప్పుడు కలిసి మాట్లాడతానన్నారు. ఎమ్మెల్యే బాలయ్యే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి పోరాటానికి మద్దతిస్తానని మాట ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఒక్క అవకాశమంటూ రాష్ట్రాన్ని నాశనం చేశారు : బాలకృష్ణ
ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ఏపీని, వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. మరోసారి మోసపోవద్దని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, అంగన్‌వాడీల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించి వారి అభివృద్ధికి దోహదం చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. ఈ విప్లవాన్ని ఆపకూడదని, రెండు మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అందరికీ అండగా ఉంటానని మాట ఇచ్చారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. పోలీసులు, అంగన్‌వాడీల మధ్య వాగ్వాదం, తోపులాట సాగింది. జిల్లా కేంద్రంలోని అనంతపురం, శింగనమల, రాప్తాడు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు.. వారి నివాసాల వద్దే బైఠాయించారు.