Page Loader
లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు

లోకేశ్ పాదయాత్రలో కుప్పకూలిన నందమూరి తారకరత్న, ఆస్పత్రికి తరలింపు

వ్రాసిన వారు Stalin
Jan 27, 2023
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'యువ‌గళం' పేరుతో తన పాదయాత్రను శుక్రవారం కుప్పం మొదలుపెట్టారు. అయితే తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న.. లోకేశ్‌తో నడుస్తున్న క్రమంలో అస్వస్థతకు గురై, ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. తారకరత్నను టీడీపీ నాయకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ కూడా హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. లోకేశ్ పాదయాత్ర ఏర్పాట్లను తారకరత్న రెండు రోజులుగా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తారక‌రత్న అలిసిపోయి ఉండొచ్చని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నారు.

పాదయాత్ర

ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే తారకరత్నకు స్పృహ లేదు: వైద్యులు

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కుప్పంలోని కేసీ ఆస్పత్రి వైద్యులు స్పందించారు. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే తారకరత్నకు స్పృహ లేదని చెప్పారు. పల్స్ రేటు కూడా తక్కువగా ఉందని వివరించారు. సీపీఆర్‌ చేయడంతో పల్స్‌ మెరుగుపడిందని వైద్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు తారకరత్నను మరో ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయ్యిందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు బాలయ్య తెలిపారు.