LOADING...
Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి 2 ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం
నారా భువనేశ్వరికి 2 ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం

Nara Bhuvaneshwari: నారా భువనేశ్వరికి 2 ప్రతిష్టాత్మక అవార్డులు ప్రదానం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2025
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025' పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమం భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు లండన్‌లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ప్రతినిధులు ఈ పురస్కారాన్ని భువనేశ్వరి గారికి అందజేశారు. అదే వేదికపై ఆమెకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు కూడా 'ఎక్స్‌లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్' విభాగంలో లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ప్రదానం చేశారు. ఆ సంస్థ వైస్ చైర్‌పర్సన్,మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో భువనేశ్వరి ఈ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు.

వివరాలు 

'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025' పురస్కారం

ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా భువనేశ్వరి చేసిన సేవలకు గానూ ఈ 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025' పురస్కారం లభించింది. ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, మహిళా సాధికారత, విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాలు వంటి విభిన్న రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థి సహాయ పథకాలు, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేపట్టిన కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని పొందారు. తలసేమియా బాధితులకు ఉచిత రక్త మార్పిడి సదుపాయం కల్పించడంతో పాటు, ఈ వ్యాధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

వివరాలు 

రైతుల సాధికారతకు హెరిటేజ్ ఫుడ్స్‌ ద్వారా భువనేశ్వరి పెద్దపీట

దేశవ్యాప్తంగా హెరిటేజ్ ఫుడ్స్‌ను ఒక ప్రతిష్ఠాత్మక డెయిరీ బ్రాండ్ గా తీర్చిదిద్దడంలో భువనేశ్వరి కీలక పాత్ర పోషించారు. సంస్థ అభివృద్ధి, కొత్త ఉత్పత్తుల ప్రవేశపెట్టడం, ఆ ఉత్పత్తులను కోట్లాది వినియోగదారులకు చేరువ చేయడంలో ఆమె చురుకైన పాత్ర వహించారు. రైతుల సాధికారతకు ఈ సంస్థ ద్వారా భువనేశ్వరి పెద్దపీట వేశారు. ఈ కృషికి గుర్తింపుగా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును ఆమె వీసీఎండీగా స్వీకరించారు.