Page Loader
Nara Lokesh: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మెగా డీఎస్సీ: నారా లోకేశ్‌
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మెగా డీఎస్సీ: నారా లోకేశ్‌

Nara Lokesh: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే మెగా డీఎస్సీ: నారా లోకేశ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 01, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. మార్చిలో ప్రక్రియ ప్రారంభించి, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బోధనారుసుములు చెల్లించాలని ఆ పార్టీ నేతలే ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

వివరాలు 

టీడీపీ పాలనలో 80% ఉపాధ్యాయ పోస్టుల భర్తీ 

విద్యాశాఖలో ఉపాధ్యాయుల అభిప్రాయాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటున్నాం.ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ప్రతి శుక్రవారం పాఠశాల విద్య కమిషనర్ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటారు. నేనూ వ్యక్తిగతంగా ఉపాధ్యాయులతో సమావేశమవుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్‌లో 80% ఉపాధ్యాయ పోస్టులు టీడీపీ హయాంలోనే భర్తీ అయ్యాయి.

వివరాలు 

రూ. 800 కోట్లు విడుదల 

వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ. 3,000 కోట్ల బోధనారుసుముల్లో తొలి విడతగా రూ. 800 కోట్లు విడుదల చేశాం. జగన్ హయాంలో పెండింగ్‌లో ఉన్న ధాన్యం, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులను కూడా చెల్లిస్తున్నాం. ఉపాధ్యాయ బదిలీలకు కొత్త చట్టం ఉపాధ్యాయ బదిలీలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్‌ల నివారణకు ప్రత్యేక విధానం, విద్యార్థుల సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేసేందుకు అపార్‌ కార్డ్ విధానం తీసుకురాబోతున్నాం.

వివరాలు 

వాట్సప్‌ గవర్నెన్స్‌కు విశేష స్పందన 

వాట్సప్‌ గవర్నెన్స్‌ ప్రజల్లో మంచి ఫీడ్‌బ్యాక్‌ పొందుతోంది. కొన్ని చిన్నపాటి సమస్యలున్నా వారంలోపే అన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాం. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు చట్టసవరణ చేయనున్నాం. రాబోయే ఆరు నెలల్లో 520 రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. పార్టీ శ్రేణుల ఎదుగుదలకు కొత్త ప్రతిపాదన పార్టీ నాయకులు, శ్రేణుల ఎదుగుదల కోసమే 'ఒక వ్యక్తి ఒకే పార్టీ పదవిలో మూడుసార్లు మించకూడదు' అనే ప్రతిపాదనను తెచ్చామని లోకేశ్ తెలిపారు. దీనిపై విస్తృత చర్చ అనంతరం నిర్ణయం తీసుకుంటాం. బూత్ కన్వీనర్‌ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎదగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

వివరాలు 

పోలీసు దిగ్బంధంపై అసహనం 

పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలీసులను పెద్దఎత్తున మోహరించడం, కార్యకర్తలు ఇబ్బందులు పడటం పట్ల లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. భద్రతా విధులను నిర్వర్తిస్తున్న ఉన్నతాధికారులను పిలిపించి ఇంతమంది పోలీసులు అవసరమా? అని ప్రశ్నించారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే పార్టీ శ్రేణులను బందోబస్తు పేరుతో ఇబ్బంది పెట్టొద్దని, ఇన్‌విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలని సూచించారు.