
Nara lokesh: ఈఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ.. పోర్టుల వద్ద భారీ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబై పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా, సోమవారం ఆయన గ్లోబల్ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఈఎస్ఆర్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగస్వామ్యంగా పని చేయడానికి వారిని ఆహ్వానించారు. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ హోటల్లో జరిగిన ఈ భేటీలో ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ సాదత్ షా, లీజింగ్ డైరెక్టర్ ప్రకృత్ మెహతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా,లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు.
వివరాలు
విశాఖ, కాకినాడ, తిరుపతి మార్గాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధి
ముఖ్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన 'ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ 4.0' పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని తెలిపారు. అయితే, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి కారిడార్లలో వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మెగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేస్తామని, ఈ పార్కుల నిర్మాణంలో ఏపీఐఐసీతో కలిసి ఈఎస్ఆర్ గ్రూప్ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. అంతేకాక, రాష్ట్రంలోని పోర్టులకు సమీపంలో మూడు నుంచి ఐదు భారీ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. ముఖ్యంగా, విశాఖపట్నం, కాకినాడ పోర్టుల వద్ద మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు ఈఎస్ఆర్ గ్రూప్ ముందుకు రావాలని ఆయన సూచించారు.
వివరాలు
భారత్‌లో 1.7 బిలియన్ డాలర్ల ఆస్తులు
దేశంలో 70 శాతం రొయ్యల ఉత్పత్తి ఏపీలో జరుగుతున్నందున, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని లోకేష్ చెప్పడం ప్రత్యేకం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల కోసం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణంలో కూడా పెట్టుబడులు పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతినిధుల సమక్షంలో, ఈఎస్ఆర్ గ్రూప్ ఆసియా-పసిఫిక్‌లో 154 బిలియన్ డాలర్ల ఆస్తులను, భారత్‌లో 1.7 బిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నట్టు వివరించారు.