Nara Lokesh: ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని సెలెస్టా వీసీకి విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌కు విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించాలనే లక్ష్యంతో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో చురుగ్గా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పలు ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థలు, వెంచర్ క్యాపిటల్ సంస్థల అధిపతులతో సమావేశాలు నిర్వహిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా వివరించారు.
వివరాలు
డీప్‌టెక్ హబ్ ఏర్పాటుకు సెలెస్టా వీసీకి ఆహ్వానం
ప్రఖ్యాత వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్‌తో లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖపట్నం ఐటీ, డేటా హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అక్కడ డీప్‌టెక్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. పరిశ్రమలకు నేరుగా రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేందుకు దేశంలోనే తొలిసారిగా 'ఎస్క్రో అకౌంట్' విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అరుణ్ కుమార్ హామీ ఇచ్చారు.
వివరాలు
అమరావతిలో 'క్రియేటర్ ల్యాండ్' ప్రాజెక్టు
క్రియేటివ్ ల్యాండ్ ఆసియా సంస్థ వ్యవస్థాపకుడు సజన్ రాజ్ కురుప్‌తో మంత్రి లోకేశ్ సమావేశమై, అమరావతిలో ప్రతిపాదిత 'క్రియేటర్ ల్యాండ్' ప్రాజెక్టును వేగంగా ప్రారంభించాల్సిందిగా కోరారు. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) ప్రకారం పనులు త్వరగా మొదలుపెడితే రాష్ట్రంలోని క్రియేటివ్ ఎకానమీకి బలమని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడులు, అలాగే 1.5 లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సజన్ రాజ్ కురుప్ తెలిపారు. రాబోయే 24 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఆటోడెస్క్, ఓప్స్‌రాంప్ సంస్థలతో సంప్రదింపులు
ప్రపంచ ప్రఖ్యాత 3డీ డిజైన్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆటోడెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్‌తో మంత్రి సమావేశమయ్యారు. అమరావతిలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనతో పాటు, డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ స్థాపనపై చర్చలు జరిపారు. అలాగే, ఐటీ మౌలిక సదుపాయాల సేవల సంస్థ ఓప్స్‌రాంప్ సీఈవో వర్మ కూనపునేనితో భేటీ అయి, రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ సిటీల ప్రాజెక్టులకు, అలాగే డిజిటల్ గవర్నెన్స్ కార్యక్రమాలకు సంస్థ సహకారం అందించాలని కోరారు.
వివరాలు
భారత కాన్సులేట్ జనరల్‌తో సమావేశం
ఈ పర్యటనలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో మంత్రి లోకేశ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని వివరించి, అమెరికాలోని కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించేందుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేశ్ సమర్పించిన ప్రతిపాదనలపై వివిధ సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ, వాటిని సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నారా లోకేశ్ చేసిన ట్వీట్
అంతర్జాతీయస్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా విసి (Celesta VC) మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్ తో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. విశాఖనగరం ఐటి, డేటా హబ్ గా శరవేగంగా అభివృద్ధి… pic.twitter.com/6wEFLtNDJf
— Lokesh Nara (@naralokesh) December 8, 2025