Nara Lokesh: స్పోర్ట్స్ హబ్ దిశగా ఏపీ.. బ్రిస్బేన్‌లో పాపులస్ సంస్థ ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌ను క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లోని ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ 'పాపులస్' ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రపంచంలోని ప్రసిద్ధ క్రీడా మైదానాలను రూపకల్పన చేసిన ఈ సంస్థతో సహకరించటం ద్వారా ఏపీలో అంతర్జాతీయ ప్రమాణాల క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమావేశంలో పాపులస్ సంస్థ సీనియర్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ షాన్ గల్లఘర్,ఆసియా పసిఫిక్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్ ఎలిజబెత్ డిసిల్వా వంటి ప్రతినిధులు పాల్గొన్నారు.
వివరాలు
ప్రపంచ ప్రఖ్యాత స్టేడియాల నిర్మాణంలో పాపులస్ సంస్థకు ప్రత్యేక గుర్తింపు
40 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన పాపులస్ సంస్థ,అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ (సర్దార్ పటేల్) స్టేడియం, లండన్ ఒలింపిక్ స్టేడియం, న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియం వంటి 3,500 కి పైగా ప్రాజెక్టులను రూపకల్పన చేసింది. ప్రస్తుతం భారత్‌లో ఎల్ అండ్ టీ సంస్థతో కలిసి పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పనిచేస్తోంది. "మనం సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఏపీలో క్రీడా రంగాన్ని బలోపేతం చేయాలనుకుంటున్నాము. రాష్ట్రంలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియంలు,శిక్షణా కేంద్రాలు నిర్మించేటప్పుడు మీ డిజైన్ సహకారం అవసరం. పర్యావరణ హితమైన, ఇంధన సామర్థ్యం గల క్రీడా మరియు వినోద వేదికలను నిర్మించడంలో ప్రభుత్వం మీతో కలిసి పని చేయాలి" అని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
వివరాలు
పర్యాటకం, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రణాళికలు
అలాగే, గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు, కమ్యూనిటీ క్రీడా సముదాయాలు, పర్యాటక అభివృద్ధి, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఇంటిగ్రేటెడ్ ఈవెంట్ స్పేస్‌ల రూపకల్పనలో కూడా భాగస్వామ్యం కావాలని మంత్రి లోకేశ్ ఆహ్వానించారు.