Kamal Haasan: దేశ ప్రయోజనాలే ముఖ్యం.. రాజకీయాలకు అతీతంగా మోదీకి కమల్ హాసన్ సపోర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీధి మైయం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడుతున్న వేళ ప్రధాని మోడీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు ఆయన బహిరంగ మద్దతు తెలిపారు. దేశ ప్రయోజనాలు రాజకీయాల కంటే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ మేరకు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదిక Xలో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. "నా ప్రియమైన భారతీయులారా.. ఇరాన్ యుద్ధ ప్రభావంపై తీవ్ర ఆందోళనతో ఓ భారతీయుడిగా మీతో మాట్లాడుతున్నానంటూ ఆయన తన సందేశాన్ని ప్రారంభించారు.
వివరాలు
ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశముంది
భారత్ గతంలో ఎన్నో యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, కొరత పరిస్థితులను ఐక్యంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడిందని కమల్ గుర్తు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరిగే అవకాశముందని, దాని ప్రభావం సామాన్య ప్రజల జీవనంపై ప్రత్యక్షంగా పడవచ్చని హెచ్చరించారు. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించాయని తెలిపారు. "60కిపైగా దేశాలు ఇప్పటికే ఇంధన పొదుపు నిబంధనలు అమలు చేస్తున్నాయి. సింగపూర్ ప్రధాని కూడా తమ ప్రజలను కష్టకాలానికి సిద్ధంగా ఉండాలని కోరారు. మన దేశం ఇంకా పెద్దది. వచ్చే ఏడాది పాటు ఇంధనాన్ని పొదుపు చేయాలని మన ప్రధాని పిలుపునిచ్చారని పేర్కొన్నారు.
వివరాలు
దేశ ప్రయోజనాలు కోసం కలిసి పనిచేయాలి
ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీలు పరస్పర విభేదాలను పక్కనబెట్టి దేశ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని కమల్ హాసన్ సూచించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మాటలను ఉదహరిస్తూ, "ప్రభుత్వాలు వస్తాయి.. పోతాయి.. కానీ దేశం శాశ్వతం. కాబట్టి దేశ బాధ్యత రాజకీయాల కంటే ఎప్పుడూ పైగా ఉండాలని వ్యాఖ్యానించారు. అదేవిధంగా పునరుత్పాదక ఇంధన రంగంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కూడా ఆయన ప్రశంసించారు. "నేను ఒక సెంట్రిస్ట్‌గా రాజకీయ అనుబంధాలకు అతీతంగా మంచి పనిని అభినందించాలి. గత దశాబ్దంలో భారత్‌లో సౌర, వాయు విద్యుత్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది.
వివరాలు
ఇంధన ధరల భారం పూర్తిగా ప్రజలపై పడకూడదు
బొగ్గు గ్యాసిఫికేషన్, పునరుత్పాదక, అణు ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెరగడం ప్రోత్సాహకరం. విదేశీ చమురు, గ్యాస్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇవి కీలక చర్యలని తెలిపారు. అయితే పెరుగుతున్న ఇంధన ధరల భారం పూర్తిగా ప్రజలపై పడకూడదని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. "పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించాలి. అలాగే రైళ్లు, మెట్రో, బస్సుల ఛార్జీలను తగ్గిస్తే ప్రజలు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గిస్తారని సూచించారు.
వివరాలు
ఈ సంక్షోభాన్ని కలిసికట్టుగా ఎదుర్కోవాలి
ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరిపైనా పడుతుందని కమల్ హాసన్ హెచ్చరించారు. "ఈ సంక్షోభాన్ని మనమంతా కలిసి ఎదుర్కొంటే భారత్ మరింత బలంగా ఎదుగుతుందని అన్నారు. ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ చమురు ధరలు, దేశీయ ద్రవ్యోల్బణంపై భారత్ ఆందోళన చెందుతున్న సమయంలో కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.