Loading...
NEET: నీట్‌ పరీక్షల భద్రతకు పకడ్బందీ చర్యలు.. వాహనాలకు జీపీఎస్‌ ట్రాకర్లు
నీట్‌ పరీక్షల భద్రతకు పకడ్బందీ చర్యలు.. వాహనాలకు జీపీఎస్‌ ట్రాకర్లు

NEET: నీట్‌ పరీక్షల భద్రతకు పకడ్బందీ చర్యలు.. వాహనాలకు జీపీఎస్‌ ట్రాకర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌ (NEET) పరీక్షల నిర్వహణలో అక్రమాలకు, ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరింత కఠినమైన భద్రతా చర్యలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలు అత్యంత పటిష్ఠంగా ఉన్నాయని, వాటిని ఛేదించడం అంత సులభం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పరీక్షల వ్యవస్థలో భద్రతను పలు దశల్లో పెంచినట్లు వివరించింది. ప్రశ్నల ఎంపికలోనూ ప్రత్యేక విధానం నీట్‌ ప్రశ్నపత్రాల తయారీలో పలువురు నిపుణుల భాగస్వామ్యం ఉంటుందని కేంద్రం వెల్లడించింది. ముందుగా భారీ స్థాయిలో క్వశ్చన్‌ బ్యాంకును రూపొందిస్తారని, అందులో నుంచి పరీక్షలో ఏ ప్రశ్నలు ఎంపికవుతాయో ప్రశ్నలను తయారు చేసిన నిపుణులకు కూడా ముందుగా తెలియదని పేర్కొంది. ఈ విధానం ద్వారా ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వెళ్లే అవకాశాలను తగ్గించామని తెలిపింది.

వివరాలు 

ప్రశ్నపత్రాల రవాణాపై జీపీఎస్‌ నిఘా

నీట్‌ ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించే వాహనాలకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.

వాహనం ప్రయాణించే సమయంలో చోటుచేసుకునే చిన్నపాటి కదలికలను సైతం ఈ వ్యవస్థలు రికార్డు చేస్తాయని తెలిపింది.

దీంతో ప్రశ్నపత్రాల రవాణా మొత్తం ప్రక్రియను అధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొంది.

పేపర్‌ లీకేజీ వ్యవస్థాగత సమస్య

ప్రశ్నపత్రాల లీకేజీ అనేది కేవలం ఒక్క వ్యక్తి లేదా ఒక ఘటనకు సంబంధించిన సమస్య కాదని, ఇది వ్యవస్థాగత లోపాలకు సంబంధించిన అంశమని రాధాకృష్ణన్‌ కమిటీ పేర్కొన్న విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది.

లీకేజీలను అరికట్టాలంటే సంస్థాగత స్థాయిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న కమిటీ అభిప్రాయం అక్షరసత్యమని వ్యాఖ్యానించింది.

వివరాలు 

సిఫార్సుల అమలుపై ఎన్‌టీఏకు ప్రశ్నలు

నీట్‌ పరీక్షలలో సంస్కరణలకు సంబంధించి రాధాకృష్ణన్‌ ప్యానెల్‌,నందన్‌ నీలేకని కమిటీ చేసిన సిఫార్సుల అమలుపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది.

ఆ సిఫార్సులను అమలు చేసేందుకు జాతీయ పరీక్షల సంస్థ(NTA)ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టిందో వివరించాలని ఆదేశించింది.

తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఎన్‌టీఏను ధర్మాసనం కోరింది.

పరీక్షల వ్యవస్థలో సమూల ప్రక్షాళన

ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో అవకతవకలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్‌టీఏ తన పరీక్షల వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే ప్రక్రియను ప్రారంభించింది.

ఇందులో భాగంగా ఇప్పటికే 50మందికిపైగా సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది.

పరీక్షల భద్రతకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను పెంచేందుకు ప్రైవేట్‌ రంగానికి చెందిన నిపుణుల సేవలను కూడా వినియోగించుకుంటున్నట్లు తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

సైబర్‌ భద్రత నుంచి ప్రశ్నపత్రాల రూపకల్పన వరకు

సైబర్‌ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్‌, ప్రశ్నపత్రాల రూపకల్పనతో పాటు ఇతర ప్రత్యేక విభాగాల్లో నైపుణ్యం కలిగిన వారిని ప్రైవేట్‌ రంగం నుంచి తీసుకువస్తున్నట్లు ఎన్‌టీఏ వివరించింది.

ప్రశ్నపత్రాల గోప్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక గదులను ఏర్పాటు చేయడంతో పాటు, ఇంటర్నెట్‌తో ఎలాంటి సంబంధం లేని ఎయిర్‌ గ్యాప్డ్‌ సిస్టమ్స్‌ను వినియోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

అంతేకాకుండా ప్రశ్నపత్రాలకు సంబంధించిన పరికరాలను భద్రపరిచే విధానాలను కూడా పూర్తిగా పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

పరీక్షల నిర్వహణలో లోపాలకు అవకాశం లేకుండా సాంకేతికత, నిపుణుల సేవలు, కఠినమైన పర్యవేక్షణను కలిపి కొత్త భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

ADVERTISEMENT