Telangana: తెలంగాణ పోలీసు నియామకాల్లో అక్రమాలకు చెక్.. అభ్యర్థులకు ప్రత్యేక యూనిక్ ఐడీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పోటీ పరీక్షల ద్వారా చేపట్టే పోలీసు నియామకాల్లో అక్రమాలకు,అవకతవకలకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ)మరో కీలక విధానాన్ని అమలు చేయనుంది. హోం శాఖతో పాటు ఇతర విభాగాల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంపిక ప్రక్రియను మరింత కచ్చితంగా చేపట్టేందుకు ప్రతి అభ్యర్థి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయనుంది. ఇందులో భాగంగా ఒక్కో అభ్యర్థికి ప్రత్యేకమైన యూనిక్ ఐడీ (విశిష్ట గుర్తింపు సంఖ్య) కేటాయిస్తోంది. దరఖాస్తు చేసుకున్న సమయం నుంచి అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికయ్యే వరకు లేదా నియామక ప్రక్రియ నుంచి తప్పుకునే వరకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ ఐడీలో భద్రపరుస్తారు. ఇందుకోసం ఫామ్-ఏ, ఫామ్-బీలతో కూడిన ప్రత్యేక ప్రొఫార్మాను మండలి సిద్ధం చేసింది.
వివరాలు
ప్రతి దశలోనూ కీలక సమాచారం
భవిష్యత్తులో నియామకాలపై అభ్యర్థులు ఫిర్యాదు చేసినా,న్యాయస్థానాలను ఆశ్రయించినా.. ఆయా దశల్లో నమోదు చేసిన వివరాలు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉండటంతో అధికారులు దీనికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు.
సాధారణ పోటీ పరీక్షలతో పోలిస్తే యూనిఫాం సర్వీసుల నియామక ప్రక్రియలో శారీరక సామర్థ్య పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది.
వీటిని సమర్థంగా నిర్వహించడం అధికారులకు సవాలుతో కూడుకున్న ప్రక్రియ. దీనికి అదనంగా రిజర్వేషన్లకు అనుగుణంగా కటాఫ్ మార్కులను హారిజాంటల్,వర్టికల్ విధానాల్లో పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుంది.
ఈ అంశాలపై అభ్యర్థుల నుంచి వివిధ సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఎంపిక ప్రక్రియలో ప్రతి దశలో అభ్యర్థి చూపిన ప్రతిభ, సామర్థ్యానికి సంబంధించిన చిన్న వివరాన్నీ యూనిక్ ఐడీలో నమోదు చేయనున్నారు.
వివరాలు
ఎంపిక పూర్తయ్యే వరకు దరఖాస్తు వివరాలే ఆధారం
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో సమర్పించిన వివరాలనే ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రామాణిక సమాచారంగా పరిగణిస్తారు.
ముందుగా ప్రాథమిక రాతపరీక్ష నిర్వహిస్తారు. ఈ సమయంలో అభ్యర్థులు పార్ట్-1 దరఖాస్తును పూర్తి చేయాలి.
ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే తదుపరి దశకు వెళ్లి పార్ట్-2 దరఖాస్తును నమోదు చేయాల్సి ఉంటుంది.
రెండు దశల్లో సమర్పించిన వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత యూనిక్ ఐడీలో నమోదు చేస్తారు.
వివరాలు
పీఎంటీ, పీఈటీ వివరాలూ నమోదు
పార్ట్-2 దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు శారీరక కొలతల పరీక్ష (పీఎంటీ), శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ) నిర్వహిస్తారు.
ఈ రెండు పరీక్షల్లో అభ్యర్థి సాధించిన ఫలితాలను కూడా యూనిక్ ఐడీలో పొందుపరుస్తారు.
అనంతరం జరిగే తుది రాతపరీక్షలో అభ్యర్థి చూపిన ప్రతిభకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు.
అలాగే అభ్యర్థి పూర్వచరిత్రపై స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) నిర్వహించే విచారణకు సంబంధించిన సమాచారాన్నీ ఇందులో చేర్చనున్నారు.
ఈ విధంగా దరఖాస్తు మొదలు తుది ఎంపిక వరకు ప్రతి దశకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట సమగ్రంగా భద్రపరచడం ద్వారా నియామక ప్రక్రియలో పారదర్శకత పెంచడంతోపాటు భవిష్యత్తులో తలెత్తే ఫిర్యాదులు, అభ్యంతరాలు, న్యాయపరమైన వివాదాలను కూడా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.