Loading...
NEET Aspirant: ఆన్‌లైన్‌ గేమింగ్‌ అప్పులు తీర్చేందుకు కిడ్నాప్‌ డ్రామా.. నీట్‌ విద్యార్థి అరెస్ట్
నీట్‌ విద్యార్థి అరెస్ట్

NEET Aspirant: ఆన్‌లైన్‌ గేమింగ్‌ అప్పులు తీర్చేందుకు కిడ్నాప్‌ డ్రామా.. నీట్‌ విద్యార్థి అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 26, 2026
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీకి చెందిన ఓ నీట్‌ విద్యార్థి ఆన్‌లైన్‌ గేమింగ్‌ ద్వారా చేసిన అప్పులు తీర్చడంతో పాటు ప్రియురాలితో విహారయాత్రలకు వెళ్లేందుకు కిడ్నాప్‌ నాటకానికి తెరలేపాడు. తనను కిడ్నాప్‌ చేసినట్లు నమ్మించి తండ్రి నుంచి రూ.5లక్షలు వసూలు చేయాలని ప్రయత్నించాడు. అయితే పోలీసులు చేపట్టిన దర్యాప్తుతో అతడి అసలు వ్యవహారం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన 17 ఏళ్ల యువకుడు లఖ్‌నవూలోని అలంబాగ్‌ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అక్కడే నీట్‌ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసైన అతడు.. ఈ క్రమంలో రూ.50 వేల వరకు అప్పు చేశాడు. ఆ డబ్బులు తీర్చడంతో పాటు తన ప్రియురాలితో టూర్లకు వెళ్లేందుకు మరింత డబ్బు అవసరమైంది.

వివరాలు 

సోదరుడు, తల్లిదండ్రులు, మేనమామకు వాట్సప్‌ సందేశాలు

దీంతో తండ్రి నుంచి డబ్బులు రాబట్టేందుకు తన కిడ్నాప్‌ జరిగినట్లు నమ్మించేలా పథకం రచించాడు.

అక్టోబర్‌ 20 నుంచి యువకుడి ఫోన్‌ పనిచేయకపోవడం, అతడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా.. యువకుడిని కిడ్నాప్‌ చేశామని, అతడిని విడిచిపెట్టాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అతడి సోదరుడు, తల్లిదండ్రులు, మేనమామకు వాట్సప్‌ సందేశాలు వచ్చాయి.

డబ్బులు ఇవ్వకపోతే యువకుడిని చంపేస్తామని సందేశాల్లో బెదిరించడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.

మరోవైపు యువకుడు తన ఫోన్‌ ద్వారా అత్త కుమార్తెకు సందేశం పంపించాడు.

వివరాలు 

ఆన్‌లైన్‌ లావాదేవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు

తాను ఎక్కడ ఉన్నానో తెలియడం లేదని, తినడానికి కూడా డబ్బులు లేవని ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు.

కొంత డబ్బు పంపాలని కోరుతూ క్యూఆర్‌ కోడ్‌ కూడా పంపించాడు. దీంతో ఆమె రూ.2,000 బదిలీ చేసింది.

ఈ ఆన్‌లైన్‌ లావాదేవీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆచూకీని గుర్తించి గాలింపు కొనసాగించగా.. అతడు మరో ప్రాంతంలో తన ప్రియురాలితో కలిసి ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో తనను ఎవరూ కిడ్నాప్‌ చేయలేదని, డబ్బులు సంపాదించేందుకే కిడ్నాప్‌ నాటకం ఆడినట్లు యువకుడు అంగీకరించాడు.

దీంతో అప్పులు తీర్చుకోవడం, ప్రియురాలితో విహారయాత్రలకు వెళ్లడం కోసం తండ్రి నుంచి డబ్బులు వసూలు చేయాలన్న అతడి పథకం బయటపడింది.

ADVERTISEMENT