NEET UG 2026: నీట్ యూజీకి కొత్త తేదీ ప్రకటించిన ఎన్‌టీఏ
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(యూజీ)-2026 పరీక్షకు కొత్త తేదీని జాతీయ పరీక్షల సంస్థ ప్రకటించింది. జూన్ 21న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 3న జరిగిన పరీక్షను ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. జాతీయ పరీక్షా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకం దెబ్బతినకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది. పరీక్ష నిర్వహణలో పారదర్శకతను కాపాడడం, విశ్వసనీయతను నిలబెట్టడం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది.
వివరాలు
భారత్‌తో పాటు విదేశాల్లో కూడా నిర్వహించిన నీట్ పరీక్ష
పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన ఒక అంచనా ప్రశ్నపత్రం కొందరు అభ్యర్థుల మధ్య చక్కర్లు కొట్టినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. అందులోని 120 రసాయన శాస్త్ర ప్రశ్నలు, వందకు పైగా జీవశాస్త్ర ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో యథాతథంగా సరిపోలినట్లు ప్రచారం జరిగింది. దీంతో పరీక్షపై అనుమానాలు మరింత పెరిగాయని ఎన్‌టీఏ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో పరీక్షను కొనసాగించడం కంటే రద్దు చేసి మళ్లీ నిర్వహించడమే సముచితమని నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. ఈ నెల 3న భారత్‌తో పాటు విదేశాల్లో కూడా నిర్వహించిన నీట్(యూజీ)-2026 పరీక్షకు మొత్తం 22.79 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.