PM Modi: క్రీడలలో ఉన్న బంధుప్రీతి 2014 కి ముందే ముగిసింది: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
క్రీడాకారుల ఎంపికలో ఒకప్పుడు కనిపించిన బంధుప్రీతి,అక్రమాలకు 2014తోనే పూర్తిగా తెరపడిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రస్తుతం కష్టపడే తత్వం, ప్రతిభ ఉన్న పేద కుటుంబాల పిల్లలు కూడా క్రీడల్లో ముందుకు వస్తూ అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. యువతలో క్రీడా సంస్కృతి, నాయకత్వ గుణాలను పెంపొందించాలనే ఉద్దేశంతో దిల్లీలో నిర్వహించిన'సంసద్ ఖేల్ మహోత్సవ్'కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేదిక ద్వారా దేశవ్యాప్తంగా వేలాది ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించే అవకాశం లభిస్తోందని తెలిపారు. 2014కు ముందు క్రీడారంగంలో అవినీతి,అన్యాయాలు విస్తృతంగా ఉండేవని మోదీ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాలకు ముగింపు పలికామని, గత పదేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు.
వివరాలు
క్రీడలకు 3 వేల కోట్లకు మించి బడ్జెట్
ఇప్పుడు సామర్థ్యం, అంకితభావంతో ముందుకు సాగే పిల్లలు క్రీడల్లో రాణిస్తూ గౌరవప్రదమైన స్థానాలు సంపాదిస్తున్నారని అన్నారు. అప్పట్లో క్రీడలకు దేశ బడ్జెట్‌లో సుమారు రూ.1,200 కోట్లే కేటాయించేవారని, ప్రస్తుతం ఆ మొత్తం రూ.3 వేల కోట్లకు మించి పెరిగిందని వివరించారు. అలాగే ప్రత్యేక పథకాల కింద అర్హులైన అథ్లెట్లకు నెలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. దేశంలోని ప్రతి క్రీడాకారుడిని ఉద్దేశించి మాట్లాడుతూ,వారు కేవలం వ్యక్తిగత విజయాల కోసం కాదు, దేశ గౌరవం కోసం ఆడుతున్నారని గుర్తుంచుకోవాలని ప్రధాని సూచించారు. త్రివర్ణ పతాక ప్రతిష్ఠను దృష్టిలో పెట్టుకుని క్రీడల్లో పాల్గొనాలని హితవు పలికారు.
వివరాలు
2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం
పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ముందుకొచ్చి ప్రోత్సహించాలని, క్రీడారంగంలో లభించే అవకాశాలను వినియోగించుకునేలా మార్గనిర్దేశం చేయాలని ఆయన కోరారు. ఇది పిల్లలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుందని అన్నారు. అలాగే 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోందని, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు కూడా వేదికగా నిలవాలనే లక్ష్యంతో దేశం ప్రయత్నాలు సాగిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వెల్లడించారు.