
Mohan Bhagwat: తానుగానీ, ఇతరులుగానీ రిటైర్ అవ్వాలని ఎప్పుడూ చెప్పలేదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సారథి మోహన్ భగవత్ స్పష్టంచేస్తూ - తాను గానీ మరెవరైనా గానీ 75 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేయాలి అని ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల సందర్భంగా గురువారం ఆయన దాదాపు రెండున్నర గంటలపాటు నిర్వహించిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మాట్లాడుతూ, పదవీ విరమణకు తాము ఎప్పుడైనా సిద్ధమేనని, కానీ సంఘ్ అవసరమని భావించేంతకాలం తాము పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ కేవలం అయోధ్య రామమందిర ఉద్యమానికి మాత్రమే మద్దతు తెలిపిందని, కానీ కాశీ, మథుర ఆలయాల విషయంలో ఏ ఉద్యమానికీ సంఘం మద్దతు ఇవ్వబోదని పేర్కొన్నారు.
వివరాలు
మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వ్యక్తులకు తప్పకుండా ఉండాలి
''దేశ విభజనకు వ్యతిరేకంగా ఆ సమయంలో సంఘ్ నిరసన తెలిపినా, దానికి ఫలితం రాలేదు. నేటి జనాభా కూర్పులో వచ్చిన మార్పులకు ముఖ్య కారణం మతమార్పిళ్లు, అక్రమ వలసలే. మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ వ్యక్తులకు తప్పకుండా ఉండాలి. అయితే ప్రలోభాలు, బలవంతపు మార్పిళ్లు అనేవి సమర్థనీయం కావు. అలాగే అక్రమ వలసదారులకు ఉద్యోగావకాశాలు ఇవ్వకూడదు. మన దేశస్థులకు మాత్రమే, అందులోనూ ముస్లింలతో సహా, అవకాశం ఇవ్వాలి'' అని ఆయన అభిప్రాయపడ్డారు. భాగవత్ మాట్లాడుతూ,సంస్కృత భాషను తప్పనిసరి చేయాలని సంఘం ఎప్పుడూ కోరలేదని,కానీ దేశ సంప్రదాయాలు,చరిత్రపై అవగాహన కలగడం చాలా ముఖ్యం అని అన్నారు. అంతేకాక,బీజేపీతో సంబంధం ఉన్న ప్రతి అంశాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌నే నిర్ణయిస్తుందని చెప్పే ప్రచారం పూర్తిగా వాస్తవ విరుద్ధమని ఆయన స్పష్టంచేశారు.
వివరాలు
దాడులకు వ్యతిరేకం:
''మతపరమైన దాడులను సంఘ్ ఎప్పుడూ సమర్థించదు. ఇస్లాం ఉండకూడదన్నది హిందూ ధోరణి కాదు. భారత్‌పై అమెరికా విధిస్తున్న 50 శాతం సుంకాలు నిజంగా ఆందోళనకరం. అంతర్జాతీయ వాణిజ్యం అవసరం, కానీ ఒత్తిడి ఆధారంగా స్నేహ బంధం కొనసాగించడం సాధ్యం కాదు'' అని ఆయన అన్నారు.