Yadagirigutta: యాదగిరిగుట్ట భక్తులకు కొత్త స్వాగత తోరణం.. రూ.3.16 కోట్లతో నిర్మాణం
ఈ వార్తాకథనం ఏంటి
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికేలా రాయగిరి వద్ద భారీ స్వాగత తోరణాన్ని నిర్మించనున్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన పాత తోరణాన్ని తొలగించి,అదే ప్రదేశంలో కొత్త స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేయాలని ఆలయ పాలక మండలి నిర్ణయించింది. 100 అడుగుల వెడల్పు, 5.5 మీటర్ల ఎత్తుతో ఈ తోరణాన్ని నిర్మించనున్నారు. ఈ వివరాలను ఆలయ ఈవో భవానీశంకర్ ఆదివారం వెల్లడించారు. కొత్త స్వాగత తోరణం నిర్మాణానికి ఆలయ పాలక మండలి ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి రూ.3.16 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఈవో తెలిపారు. పుణ్యక్షేత్రానికి ప్రధాన ప్రవేశ మార్గంలోనే ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
వివరాలు
భక్తుల సౌకర్యాల కోసం 26 కీలక నిర్ణయాలు
దీని ద్వారా యాదాద్రి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతోపాటు.. భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఆకర్షణీయంగా పరిచయం చేయాలన్నది పాలక మండలి ఉద్దేశంగా తెలుస్తోంది.
యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి ఇటీవల నిర్వహించిన తొలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతులు, ఆధ్యాత్మిక సేవల విస్తరణకు సంబంధించి మొత్తం 26 అంశాలకు ఆమోదం తెలిపింది.
పాలక మండలి ఛైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో.. ఆలయానికి వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సౌకర్యాలను దశలవారీగా విస్తరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ప్రస్తుతం రోజుకు 1,500 మంది భక్తులకు అన్నప్రసాదం అందించే సామర్థ్యం ఉంది.
వివరాలు
దీక్షాపరుల కోసం ప్రత్యేక మండపం
దీన్ని ఇకపై 2 వేల మందికి భోజనం అందించేలా పెంచనున్నారు.
పండుగలు, ప్రత్యేక పర్వదినాలు, వారాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసాద వితరణ వ్యవస్థను మరింత విస్తరించనున్నారు.
దీక్షతో యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల కోసం రూ.43.12 కోట్ల అంచనా వ్యయంతో ప్రత్యేక దీక్షాపరుల మండపాన్ని నిర్మించేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది.
అలాగే ప్రస్తుతం బాలాలయం ఉన్న ప్రదేశంలో రూ.9.87 కోట్లతో నిత్యకల్యాణ మండపాన్ని నిర్మించనున్నారు.
ఈ రెండు నిర్మాణాలు పూర్తయితే ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు మరింత అనువైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
భక్తులకు ఆలయ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యాలకు ఆన్‌లైన్ సదుపాయం కల్పించాలని పాలక మండలి నిర్ణయించింది.
వివరాలు
మెట్ల మార్గంలో పైకప్పు.. గిరిప్రదక్షిణకు సోలార్ వ్యవస్థ
దీంతో భక్తులు ఆలయానికి చేరుకునే ముందే తమకు అవసరమైన సేవలను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
కాలినడకన కొండపైకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గంలో సుమారు రూ.1.40 కోట్లతో పైకప్పును నిర్మించనున్నారు.
ఎండ,వర్షం నుంచి భక్తులకు రక్షణ కల్పించడమే ఈ నిర్మాణం ప్రధాన ఉద్దేశం.
గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా పాలక మండలి నిర్ణయించింది.
వేద విద్యకు మరింత ప్రోత్సాహం అందించేలా యాదగిరిగుట్టలోని వేద పాఠశాలను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు.
తులసి కాటేజ్ వద్ద మరో కల్యాణకట్ట నిర్మాణం, దాతల కోసం ప్రత్యేక సదుపాయాల కల్పన,కొండపై విరాళాల నిర్వహణకు ప్రత్యేక గది ఏర్పాటు వంటి ప్రతిపాదనలకు కూడా పాలక మండలి ఆమోదం తెలిపింది.
వివరాలు
మెట్ల మార్గంలో పైకప్పు.. గిరిప్రదక్షిణకు సోలార్ వ్యవస్థ
ఇదిలా ఉండగా.. బోర్డు సభ్యురాలు కొణిదల సురేఖ అందించే విరాళంతో రూ.84 లక్షల వ్యయంతో ఎలక్ట్రిక్ శంఖు, చక్ర నామాల బోర్డును ఏర్పాటు చేయనున్నారు.
మొత్తంగా భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను పెంచడంతోపాటు.. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేలా పాలక మండలి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతోంది.