New Criminal Laws: జూలై 1 నుంచి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1, 2024 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్రం ఇటీవల మూడు కొత్త క్రిమినల్ చట్టాలను తీసుకొచ్చింది. మూడు కొత్త క్రిమినల్ జస్టిస్ బిల్లులను డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ఈ మూడు కొత్త బిల్లులు చట్టాలుగా మారాయి. కొత్త మూడు చట్టాలకు ఇండియన్ జ్యుడీషియల్ కోడ్, ఇండియన్ సివిల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పేర్లు పెట్టారు.
బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ఇక చెల్లు
ప్రస్తుతం బ్రిటీష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలే అమలవుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో నేర న్యాయ వ్యవస్థను మార్చడమే లక్ష్యంగా మూడు చట్టాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్త చట్టాలు అమల్లోకి వస్తే.. 'దేశద్రోహం' నేరం రద్దు అవుతుంది. అయితే దాని స్థానంలో రాష్ట్రంపై నేరాలకు పాల్పడే కొత్త సెక్షన్‌ను తీసుకొచ్చారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. మూకదాడి లేదా కులం లేదా సంఘం పేరుతో హత్య చేస్తే సమూహంలోని ప్రతి సభ్యునికి జీవిత ఖైదు విధించబడుతుంది. ఇలా అనేక కొత్త క్రిమినల్ నిబంధనలను నూతన చట్టాల్లో కేంద్రం ప్రభుత్వం చేర్చింది.